Indian Railway : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులపై స్వల్పంగా చార్జీల భారాన్ని మోపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సేవలను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జూలై 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం సుదూర ప్రాంతాలకు ప్రయాణించే లక్షలాది మందిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. మనదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రైల్వేపై ఆధారపడుతారు. ముఖ్యంగా జనరల్ కోచులు, మెయిల్, ప్యాసింజర్స్ రైళ్లలో వారే అధికంగా జర్నీ చేస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్న తరుణంలో మరల ఇండియన్ రైల్వే టికెట్ చార్జీలు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చార్జీల పెంపు ఇలా..
కొత్త విధానం ప్రకారం నాన్-ఏసీ తరగతులైన సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చార్జీ పెరగనుంది. అదేవిధంగా, ఏసీ క్లాస్ (ఏసీ చైర్ కార్, 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్ ఏసీ) ప్రయాణికులు కిలోమీటరుకు రెండు పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 500 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు ఈ పెంపు వర్తించదు. సబర్బన్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్ల (MST) ధరలలో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం.
సామాన్యులపై ప్రభావం
ఈ ధరల పెంపు తక్కువ దూరం ప్రయాణించే వారిపై పెద్దగా ప్రభావం చూపదని అధికారులు చెబుతున్నప్పటికీ, సుదూర ప్రయాణాలు చేసే మధ్యతరగతి ప్రజలపై ఇది అదనపు భారమే. ఉదాహరణకు, ఢిల్లీ నుంచి ముంబైకి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, నాన్-ఏసీ టికెట్‌పై రూ.14, ఏసీ టికెట్‌పై రూ.28 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ వంటి ఇతర చార్జీలలో మార్పులు చేయకపోవడం ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే అంశం.
పారదర్శకతకు కొత్త నిబంధనలు
ఈ చార్జీల పెంపుతో పాటే, టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు రైల్వే శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు ధృవీకరణను తప్పనిసరి చేసింది. దీనివల్ల టికెట్ దళారుల బెడద తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏజెంట్లు ఉదయం 10:00 నుంచి 10:30 గంటల మధ్య ఏసీ క్లాస్, 11:00 నుంచి 11:30 గంటల మధ్య నాన్-ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లను బుక్ చేయకుండా ఆంక్షలు విధించారు.
ఈ చార్జీల పెంపు రైల్వేల ఆర్థిక పరిపుష్టికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, పెరిగిన ధరలకు అనుగుణంగా రైళ్లలో పరిశుభ్రత, భద్రత, సమయపాలన వంటి సేవలు మెరుగుపడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు.ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లపై ఈ పెంపు వర్తించకపోవడం ఊరట కలిగించే విషయం.