మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గ ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య (Baba Siddique Murder) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
దుండగులు పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్దిఖీ నివాసం, కార్యాలయాల వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. మరోవైపు బాబా సిద్ధిఖీకి, ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో వ్యాపార వివాదాలే ఈ సుపారీ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. సిద్ధిఖీ హత్యకు దుండగులు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ హత్య కాంటాక్ట్ కిల్లింగ్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక సిద్దిఖీ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యు లకు సానుభూతిని ప్రకటించారు. ఈ హత్య ఘటన మహారాష్ట్రలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బాబా సిద్ధిఖీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దగ్గరి స్నేహితులు.. ఇటీవల సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో బాబా సిద్ధిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో సీనియర్ రాజకీయవేత్త అయిన బాబా సిద్ధిఖీ గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
Read Also : Green Tea Effects: గ్రీన్ టీ తాగేవారు ఈ తప్పులను చేయకండి!