Rahul Gandhi: క్లారిటీ ఇవ్వని రాహుల్.. కాంగ్రెస్ భావి అధ్యక్షుడు ఎవరు!?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో రాహుల్ గాంధీ నిలబడతారా? నిలబడరా ? రాహుల్ నో అంటే.. కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Updated On - August 20, 2022 / 02:17 PM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో రాహుల్ గాంధీ నిలబడతారా? నిలబడరా ? రాహుల్ నో అంటే.. కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. ఇప్పుడే ఈ టాపిక్ పై హాట్ డిబేట్ జరగడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేమిటంటే.. కాంగ్రెస్
పార్టీ గత ఏడాది అక్టోబర్‌లో చేసిన ప్రకటన ప్రకారం ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అంటే మరో రెండు రోజుల్లోగా ఇది మొదలు కావాలి. సెప్టెంబర్ 20 లోగా ఇతర ప్రక్రియలన్నీ పూర్తి చేసి.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెల్లడించింది.

మరింత ఆలస్యమే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రకటన బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ కు పునాదిగా ఉన్న గాంధీ కుటుంబాన్ని కాదని అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారు? ఎవరూ ఆ పనికి సాహసించరు. రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసే మూడ్ లో లేరనే టాక్ వినిపిస్తోంది. సాధారణ పార్టీ నేతగా ఉంటూ.. వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకోవడానికే రాహుల్ ప్రాధాన్యం ఇస్తున్నారట. కుటుంబవాదంపై బీజేపీ ఘాటు విమర్శలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడితే.. ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉంటుందని రాహుల్ భావిస్తున్నారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి ఆయన.. కాంగ్రెస్అధ్యక్ష పదవిని చేపట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీని అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఒప్పించడంలో కాంగ్రెస్ వ్యూహకర్తలు ఇప్పటివరకు విఫలమయ్యారు. రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని పిలవడం లేదు. ఆ మీటింగ్ లోనే కీలకమైన అధ్యక్ష ఎన్నికల తేదీని ప్రకటిస్తారు.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 నుంచి కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఈ యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని, అప్పటికి పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగకపోతే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 20 నాటికి రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా ఎన్నుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ పూర్తి కాలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కాలంగా కాంగ్రెస్ సారథులు లేరు.

ఆ పేర్లను పరిశీలిస్తారా?

రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. దీంతో అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, సి.వేణుగోపాల్ వంటి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో .. సోనియా గాంధీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఈక్రమంలో సోనియాగాంధీ కి అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చడంలో సహకరించేందుకు ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఛాన్స్ ఉంది.

బీజేపీ కక్షసాధింపు నేపథ్యంలో..

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత..  2020లో జీ–23 పేరుతో కొందరు సీనియర్‌ నేతలు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇంకా కొనసాగుతున్నారు.  బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు తెరతీస్తూ ఎదురు తిరిగిన వారిపై సీబీఐ, ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన వారే పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే రాహుల్‌ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధ్యక్ష పదవిపై ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు సారథిగా ఉంటేనే అధికార పార్టీ వారిని టచ్‌ చేయడానికి జంకుతుందని పరిశీలకులు అభిప్రాయపదుతున్నారు. ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందని ఇటీవల ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో కొందరు నాయకులు డిమాండ్‌ చేశారు.