Rahul Vs Modi : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ మహారాష్ట్రలోని అమరావతికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేరుకున్నారు. అయితే హెలిప్యాడ్‌లో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే.. ఎన్నికల సంఘం అధికారులు రాహుల్ గాంధీ బ్యాగులను తనిఖీ చేశారు. రాహుల్ గాంధీ అక్కడే నిలబడి.. ఈసీ ఆఫీసర్లు హెలికాప్టర్‌ను తనిఖీ చేయడాన్ని గమనించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ(Rahul Vs Modi) వెళ్లారు. అయితే అక్కడ ప్రచారం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ వెంటనే హెలికాప్టర్‌లో వెళ్లిపోవడానికి అనుమతులు ఇవ్వలేదు. సరిగ్గా అదే టైంలో పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటన ఉన్నందున.. రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను అధికారులు గ్రౌండింగ్ చేయించారు. దీనిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో ఇవాళ మహారాష్ట్రలో ఆయన హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేయడం గమనార్హం. ఇక శుక్రవారం రోజు మహారాష్ట్రలోని హింగోలిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌ను కూడా ఈసీ ఆఫీసర్లు చెక్ చేశారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన పోల్చారు. బైడెన్‌లా మోడీ కూడా జ్ఞాపకశక్తిని కోల్పోయినట్టు (మెమొరీ లాస్) అనిపిస్తోందని రాహుల్ ఎద్దేవా చేశారు. ‘‘గతంలో జో బైడెన్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరుకు బదులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరును పలికారు. మోడీ కూడా అలాగే చేస్తున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Nayanthara : ‘‘ధనుష్ క్రూరుడు.. నా హృదయాన్ని ముక్కలు చేశాడు’’.. నయనతార ఫైర్
‘‘కులగణనను మేం సమర్ధిస్తున్నాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని మేం చెబుతున్నాం. ప్రధాని మోడీ మాత్రం మెమొరీ లాస్ అయిన వ్యక్తిలా కాంగ్రెస్ పార్టీ విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం రిజర్వేషన్లకు వ్యతిరేకులం కాదు. కుల గణనకు వ్యతిరేకులం కాదు’’ అని రాహుల్ స్పష్టం చేశారు. ‘‘కుల గణనకు మోడీయే వ్యతిరేకి. ఒకవేళ అందుకు ఆయన సానుకూలంగా ఉండి ఉంటే.. ఐదేళ్ల క్రితమే దేశంలో కులగణన జరిగి ఉండేది’’ అని ఆయన విమర్శించారు. ‘‘మేం రాజ్యాంగాన్ని భారతదేశ డీఎన్‌ఏగా భావిస్తాం. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు రాజ్యాంగం అంటే లెక్కలేదు. వాళ్ల సిద్ధాంతాలే వేరు’’ అని రాహుల్ మండిపడ్డారు.