Parbhani violence : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని పర్భానీలో చెలరేగిన హింసకాండలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం సూర్య వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్భానీలో చెలరేగిన అల్లర్లలో అరెస్ట్ అయిన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణమని ఆరోపించారు.
సూర్య వంశీ ఒక దళితుడని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న ఆ వ్యక్తిని హత్య చేశారని రాహుల్ గాంధీ అన్నారు. మృతుడి వీడియోలు, ఫోటోలు చూస్తే ఇది 100% కస్టోడియల్ డెత్ అని అనిపిస్తుందని ఆరోపించారు. అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విచారణతో నేను ఏమాత్రం సంతృప్తి చెందలేదు అని ఆయన అన్నారు. పర్భానీ ఘటనకు ఎవరు బాధ్యులని అడిగిన ప్రశ్నకు దీనికి భావజాలం బాధ్యత వహిస్తుంది. మరియు ముఖ్యమంత్రి మాట్లాడినందున అతను కూడా బాధ్యుడే అని రాహుల్ గాంధీ అన్నారు. తరువాత పర్భానీలో హింసాకాండను అనుసరించి నిరసనలో మరణించిన విజయ్ వాకోడే కుటుంబాన్ని కూడా రాహుల్ గాంధీ కలిశారు.
ఇటీవల మహారాష్ట్రలో హింసకాండ చెలరేగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం భారీ నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఆందోళనకు దిగిన వారిలో దాదాపు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో న్యాయ విద్య చదువుతున్న సోమనాథ్ సూర్య వంశీ కూడా ఉన్నారు. కస్టడీలో ఉన్న సూర్య వంశీకి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్య వంశీ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించారు. పర్భానీ హింసపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.
Read Also: No Detention Policy : 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్’ రద్దు