Site icon HashtagU Telugu

Rahul Padyatra: కశ్మీర్ టు కన్యా కుమారి.. రాహుల్ పాదయాత్ర

Rahul Meeting

Rahul Meeting

దేశ ప్రజలతో మమేకం అయ్యే సంకల్పంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ లో దీనిపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంది. దీనికితోడుగా ప్రతి రాష్ట్రంలో అక్కడి కాంగ్రెస్ ప్రధాన నాయకులు పాదయాత్రను నిర్వహిస్తారని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఈ పాదయాత్రలు జరగనున్నాయి. ఈపాదయాత్ర పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. ”పాదయాత్రకు సంబంధించిన ప్రతిపాదన దాదాపుగా ఖాయమైనట్టే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతుంది. ప్రజలను నేరుగా కలుసుకునే లక్ష్యంలో భాగంగా జనతా దర్భార్ లను కూడా నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది’’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరును రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. మత ప్రతిపాదకన దేశ ప్రజలను విడగొట్టి.. మైనారిటీలను భయంలోకి నెట్టేందుకు బీజేపీ సర్కారు యత్నిస్తోందనే అంశాన్ని కూడా జనానికి చెప్పనున్నారు. కార్మికులు, సాధారణ ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడంతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. దీంతోపాటు దేశంలో నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభంపై పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేపట్టాలని చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

Exit mobile version