Site icon HashtagU Telugu

Rahul Gandhi: కులగణనపై కేంద్రానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ.. కానీ, కేంద్రం ముందు నాలుగు డిమాండ్లు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగ‌తించారు. బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెలుపుతామ‌న్న రాహుల్‌.. ప్ర‌భుత్వం ముందు నాలుగు డిమాండ్ల‌ను కూడా ఉంచారు. ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా కుల గ‌ణ‌న‌ను ప్ర‌క‌టించింది. ఇది సామాజిక న్యాయం వైపు మొద‌టి అడుగు. సామాజిక న్యాయం కోసం ప‌నిచేస్తున్న ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త అభినంద‌న‌ల‌కు అర్హులు. నేను వారి ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము కుల గ‌ణ‌న నిర్వ‌హిస్తామ‌ని, 50శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని ర‌ద్దు చేస్తామ‌ని పార్ల‌మెంటులో స్ప‌ష్టంగా చెప్పాము. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు.. మేము దానిని స‌మ‌ర్థిస్తున్నాం. కానీ, జ‌నాభా గ‌ణ‌న ఎప్పుడు ప్రారంభిస్తార‌నే విష‌యాన్ని కూడా కేంద్రం చెప్పాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశంలో కేవ‌లం నాలుగు కులాలు ( పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ధ‌నిక‌, చాలా ధ‌నిక‌) మాత్ర‌మే ఉన్నాయ‌న్న మోదీతో ఏకీభ‌విస్తున్నామ‌ని చెప్పారు. ఈ నాలుగింటిలో ప్ర‌జ‌లు ఏ కేట‌గిరిలో ఉన్నారో తెలుసుకోవ‌డానికి కుల డేటా అవ‌స‌ర‌మ‌ని రాహుల్ పేర్కొన్నారు. కుల గ‌ణ‌నలో ఇది మొద‌టి అడుగు మాత్ర‌మే. ఇంకా చాలా చేయాల్సి ఉంద‌ని చెప్పారు. తెలంగాణలో చేసిన కులగణన బ్లూప్రింట్‌గా, దేశానికి మోడల్‌గా ఉంటుందని రాహుల్ సూచించారు.

 

కాంగ్రెస్ నాలుగు ప్రధాన డిమాండ్లు ..
♦ జ‌నాభా గ‌ణ‌న‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎలా నిర్వ‌హిస్తారో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయాలి.
♦ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌హాలో వేగ‌వంతమైన, పార‌ద‌ర్శ‌క‌మైన, అంద‌రినీ క‌లుపుకొనిపోయే కుల స‌ర్వే న‌మూనాను స్వీక‌రించాలి.
♦ జ‌నాభా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు.. 50శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని ఎత్తివేయాలి.
♦ ప్ర‌భుత్వ సంస్థ‌ల మాదిరిగానే ప్రైవేట్ సంస్థ‌ల్లోనూ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలి.