Site icon HashtagU Telugu

Rahul Gandhi – PAK : పాకిస్తాన్ కన్నా భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువ : రాహుల్

Rahul Gandhi Pak

Rahul Gandhi Pak

Rahul Gandhi – PAK : బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్ కన్నా భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మోడీ సర్కారు వైఫల్యం వల్లే గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు మనదేశంలో ఏర్పడిందన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నిర్వహించిన రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై  ఫైర్ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి నిర్ణయాల వల్ల దేశంలోని చిన్న వ్యాపారాలు దివాలా తీశాయని మండి పడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న నిరుద్యోగం కంటే రెండింతలు ఎక్కువ నిరుద్యోగం భారత్‌లో ఉందని రాహుల్ (Rahul Gandhi – PAK) చెప్పారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ‘‘ఇక్కడ ఇంత మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లంతా అక్కడ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు’’ అని ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

కేవలం ధనికుల కోసమే మోడీ సర్కారు రైల్వే పాలసీలను రూపొందిస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.  ఏటా 10 శాతం రైల్వే చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తోందన్నారు. చివరకు రైల్వే టికెట్ క్యాన్సలేషన్‌ చార్జీలను కూడా పెంచడం దారుణమని పేర్కొన్నారు.  ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ చార్జీలను పెంచడం ఏమిటని కేంద్ర సర్కారును ఆయన ప్రశ్నించారు. పేదలు కనీసం కాలు కూడా పెట్టలేని లగ్జరీ రైళ్లను నడపడం ఎందుకని రాహుల్ అడిగారు. రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచి.. జనరల్‌ కోచ్‌ల సంఖ్యను తగ్గించడం అనేది సబబు కాదన్నారు.

జనరల్ కోచ్‌లు తగ్గిస్తారా ?

జనరల్ కోచ్‌ల సంఖ్యను తగ్గించడం వల్ల దేశంలో నిత్యం రాకపోకలు సాగించే కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ కోచ్‌ల కంటే మూడు రెట్లు  ఎక్కువ సంఖ్యలో  ఏసీ రైల్వే కోచ్‌లు  తయారు చేస్తుండటాన్ని బట్టి మోడీ సర్కారు వైఖరిని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని రాహుల్ కోరారు. రైల్వే బడ్జెట్‌‌ను విడిగా ప్రవేశపెట్టడం ఆపేయడం వల్ల రైల్వేలో జరిగే కుంభకోణాలు పారదర్శకంగా బయటికి తెలియడం లేదన్నారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా రాహుల్ ఒక ట్వీట్ చేశారు.

Also Read :Flipkart UPI : ‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’ వచ్చేసింది.. విశేషాలివీ

Also Read :Darling : మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే : హైకోర్టు