Rahul Gandhi House Shifting : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇల్లు మారబోతున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గతంలో నివసించిన ఇంట్లోకి ఆయన మారుతారనే వార్తలు వస్తున్నాయి. మూడు బెడ్ రూమ్స్ ఉన్న ఈ ఇల్లు దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ఏరియాలో ఉంది. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా ఉంటున్న అధికారిక బంగళాను ఏప్రిల్ 22న రాహుల్ ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఆయన తన తల్లి సోనియాగాంధీ నివాసంలో ఉంటున్నారు. తమ ఇంట్లో నివసించాలంటూ వందలాది మంది కాంగ్రెస్ నేతలు కోరినప్పటికీ, తగిన ఇంటి కోసం రాహుల్ గాంధీ వెతికారు.
షీలా దీక్షిత్ 2019లో చనిపోయారు. అప్పుడు శ్రద్ధాంజలి ఘటించేందుకు రాహుల్ (Rahul Gandhi) ఆమె ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం షీలా దీక్షిత్ కుటుంబ సభ్యులు తమ ఇంటికి సమీపంలోనే ఉన్న మరో ఫ్లాట్‌లోకి మారాలని అనుకుంటున్న విషయం రాహుల్ కు తెలియడంతో.. వారి ఇంట్లోకి మారాలని ఆయన డిసైడయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ బంగళా 1,500 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంటుంది. ఈ ఇంటికి చుట్టుపక్కల చారిత్రక ప్రాధాన్యంగల స్థలాలు ఉన్నాయి. 16వ శతాబ్దం నాటి మ్యూజియం, హుమయూన్ టోంబ్, 13వ శతాబ్దంనాటి నిజాముద్దీన్ ఔలియా దర్గా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
ఆయన నిర్వహించిన భారత్ జోడో యాత్ర గత ఏడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలోకి ప్రవేశించినపుడు నిజాముద్దీన్ ఔలియా దర్గాలో రాహుల్ (Rahul Gandhi) ప్రార్థనలు చేశారు.ఇక షీలా దీక్షిత్ ఈ ఇంటిని 1991లో కొన్నారు. ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆమె 2019 జూలైలో మరణించే వరకు ఈ ఇంట్లోనే నివసించారు.
Also Read: Secret Camera: అమ్మాయిల రూముల్లో సీక్రెట్ కెమెరా, నగ్న దృశ్యాలు రికార్డ్.. చివరకు ఏమైందంటే!