Site icon HashtagU Telugu

Rahul Gandhi: చైనా రాయబారి ఘటన తరువాత.. చైనాపై రాహుల్ వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా కాలం తరువాత చైనా అంశాన్ని ప్రస్తావించారు. మొన్నామధ్య నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో చైనా రాయబారితో మాటలు కలిపారన్న విమర్శలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ లోలోన చైనాకు ఫేవర్ గా ఉంటూ.. బయటకు మాత్రం చైనాపై ద్వేషం చూపిస్తుంటారని బీజేపీ నేతలు ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా అనే పదం రాహుల్ గాంధీ నోటి నుంచి రాలేదు. ఇన్ని రోజుల తరువాత చైనా ఆక్రమణను ప్రముఖంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ.

లద్దాఖ్ లో మారుతున్న పరిస్థితులపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనాతో ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. రష్యా-ఉక్రెయిన్ కొట్లాడుకుంటున్న రీతిలో ఎల్ఏసీ వద్ద పరిస్థితులు మారాయంటూ పోల్చారు. భారత్ లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చెప్పుకుంటున్న చైనా.. రష్యా చెప్పిన కారణంతోనే కయ్యానికి కాలుదువ్వుతోందని చెప్పుకొచ్చారు. లద్దాఖ్, డోక్లాంలో ఇప్పటికే తిష్ట వేసిన చైనా దళాలు.. రేప్పొద్దున అవి తమవేనంటూ దాడికి దిగినా దిగొచ్చని అన్నారు. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా సరే బీజేపీ ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయిందని ఆరోపించారు.

చైనా ఆక్రమణ, భారత్ తో ఘర్షణల గురించి ఎవరైనా మాట్లాడితే.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. ఇదే సందర్భంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి ఫలాలు కొందరికే అందాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నామని, తాము మాత్రం అందరికీ సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.