Site icon HashtagU Telugu

Punjab Elections 2022: చ‌న్నీకి “జై” కొట్టారు స‌రే.. సిద్ధూ స‌హ‌క‌రిస్తాడా..?

Panjab Elections2022

Panjab Elections2022

పంజాబ్ సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా అక్క‌డి అధికారం ప్ర‌త్రిప‌క్ష పార్టీలు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి ప‌ట్టు లేక‌పోవ‌డం, పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి క‌లిసివ‌చ్చే అంశం. ఆప్ నుండి మాత్రమే అక్క‌డ కాంగ్రెస్‌కు పోటీ ఎదురు కానుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. పంజాబ్‌లో కాంగ్రెస్ త‌రుపున ఈసారి ముఖ్య‌మంత్రి అభ్యర్ధి ఏవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపే అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్వంఠ నెల‌కొనిఉంది. అయితే తాజాగా కాంగ్రెస్ ముఖ్య‌నేత రాహుల్ గాంధీ ఇన్నాళ్ళ స‌స్పెన్స్‌కు తెర‌దించారు. ఆదివారం లూథియానాలో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ ర్యాలీలో భాగంగా, రాహుల్ గాంధీ ప్ర‌సంగిస్తూ.. ప్ర‌స్తుతం పంజాబ్ సీఎంగా ఉన్న చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీని తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీయం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు.

ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి విశ్వాసం ఉంద‌ర‌ని, ఆయనకు ఎలాంటి అహం లేదని, రాహుల్ గాంధీ అన్నారు. నిరుపేద ఇంటి నుండి ముఖ్య‌మంత్రి కావాల‌ని పంజాబ్ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, పేద‌రికాన్ని అర్ధం చేసుకునేవారు సీయంగా ఉంటే, కుల మ‌తాల‌కు అతీతంగా అన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్ర‌మంలో పంజాబ్ ప్ర‌జ‌లు, కార్మికుల అభిమతం మేర‌కు చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌కటిస్తున్న‌ట్లు రాహుల్ అన్నారు. ఇక పంజాబ్ అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ అన్నారు. త‌న‌కు పంజాబ్ ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ యుద్ధం చేయ‌గ‌ల‌న‌ని, పంజాబ్‌ను అభివృద్ధి ప‌దంలోకి తీసుకెళ్ళేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని చ‌న్నీ అన్నారు.

ఇక ఎన్నికలకు ఏడాది ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ ముఖ్య‌మంత్రి అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిత్వం కోసం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పోటీ ప‌డ‌గా, కాంగ్రెస్ అధిష్టానం ఆన్‌లైన్‌లో కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం సేక‌రించింది. ఈ క్ర‌మంలో ఎక్కువ మంది చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీకే జై కొట్ట‌డంతో,, చ‌న్నీ, సిద్ధూ ఇద్ద‌రితో చ‌ర్చించిన త‌ర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం తీసుకోగా, తాజాగా సీయం అభ్య‌ర్ధిని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం, ఎంత‌గానో ఎదురు చూసిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి భంగపాటు తప్పలేదని అంటున్నారు అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గీయులు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెబుతున్న సిద్ధూ, ఫ్యూచ‌ర్‌లో చ‌న్నీకి ఎంత‌వ‌ర‌కు స‌హ‌క‌రిస్తాడ‌నేది చూడాలని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.