Price Hike: 8 ఏళ్ల గరిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం, నిత్యవసర ఆహార పదార్థాల ధరలు సలసల…

దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ మాసానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరి 7.79 శాతానికి చేరుకుంది.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 11:40 AM IST

దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ మాసానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరి 7.79 శాతానికి చేరుకుంది. నిత్యవసర ఆహార ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్,డీజిల్ సహా ఎల్పీజీ లాంటి ఇంధన ధరలు, ఆహార ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే దేశంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. కాగా ఇది వరుసగా నాల్గవ నెలలో రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం గరిష్ట పరిమితి కంటే ఎక్కువగా ఉంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 6.95 శాతంగా నమోదు కాగా, గత సంవత్సరం అంటే ఏప్రిల్ 2021లో 4.23 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరుకుంది
ఇక ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.68 శాతం నుంచి 8.38 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)ని కోరింది.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే…
దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ-రాజకీయ పరిస్థితుల కారణంగా, ఆహార వస్తువుల ధరల విపరీతమైన పెరుగుదల ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌లో కూడా కనిపిస్తోందని, దీంతో ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే రెపో రేటును పెంచడం ద్వారా, RBI ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం మరింత ఖరీదుగా మారింది.

ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కూరగాయలు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై కూడా పడింది. ఇదిలా ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అయితే, ఈ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరడంతో ఆర్బీఐ మరోసారి ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు మరోసారి వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు.