Putin Waited For PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. పీఎం మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరినొకరు కలుసుకున్న తీరు ట్రంప్, షెహబాజ్ షరీఫ్‌లకు కలవరం కలిగించింది. ముఖ్యంగా మోదీ, పుతిన్ (Putin Waited For PM Modi) ఒకే కారులో ప్రయాణించడం విశేషం.
పీఎం మోదీ కోసం 10 నిమిషాలు వేచి చూసిన పుతిన్
చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సమ్మిట్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పుతిన్ పీఎం మోదీతో ఒకే కారులో ప్రయాణించాలని కోరుకున్నారు. దాని కోసం ఆయన భారత ప్రధాని కోసం 10 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై మాట్లాడుకుంటూ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్న తర్వాత కూడా ఇద్దరు నాయకులు సుమారు 45 నిమిషాల పాటు కారులోనే చర్చలు జరిపారు. ఆ తర్వాత ఒక హోటల్‌లో ఇద్దరు నేతల మధ్య గంట సేపు ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
Also Read: Ghee : జీర్ణసంబంధిత వ్యాధులున్న వారు నెయ్యి తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ద్వైపాక్షిక సమావేశానికి కలిసి చేరుకున్న పీఎం మోదీ-పుతిన్
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు. పీఎం మోదీ సోషల్ మీడియాలో పుతిన్ ‘ఆరస్ లిమోజిన్’ కారు లోపల ఉన్న తమ ఇద్దరి ఫోటోను కూడా పంచుకున్నారు. పీఎం మోదీ మాట్లాడుతూ.. “SCO సమ్మిట్ వేదికపై కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేను, అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశ స్థలానికి కలిసి వెళ్లాము. ఆయనతో చర్చలు ఎల్లప్పుడూ సార్థకంగా ఉంటాయి” అని అన్నారు. వారి ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్ వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించడం మానవత్వానికి చాలా అవసరమని మోదీ పుతిన్‌కు చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని తీసుకురావడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు.