Site icon HashtagU Telugu

Sonu Sood: సోనూ సూద్ పై కేసు న‌మోదు.. అస‌లు కార‌ణం ఇదే..!

Sonu Sood

Sonu Sood

ప్ర‌ముఖ సినీ నటుడు సోనూ సూద్ పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఇండియాలో ఐదు రాష్ట్ర‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో, ఆదివారం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నికల నేప‌ధ్యంలో సోనూ సూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిచార‌నే కార‌ణంతో, ఆయ‌న పై పంజాబ్‌లోని మోగాలో కేసు నమోదు అయ్యింది. క‌రోనాకు ముందు సాదార‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్, లాక్‌డౌన్ టైమ్‌లో దేశ వ్యాప్తంగా ఎంతో మంది కూలీల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో, ఎంతోమంది అన్నార్థులకు సాయం అందించిన సోనూ సూద్, సీరియస్‌ పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి ప్రాణాలు కాపాడాడు. అంతే కాకుండా కరోనా టైమ్‌లో అనేక‌మందికి ర‌క‌రకాలుగా స‌హాయం చేస్తూ, రియ‌ల్ హీరోగా మారిన సోనూ ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల దేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగుతున్న నేప‌ధ్యంలో సోనూ సూద్ సోద‌రి మాళ‌విక కాంగ్రెస్ పార్టీలో చేర‌డ‌మే కాకుండా పంజాబ్‌లోని మోగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేశారు.

అయితే పోలింగ్ రోజున సోద‌రి మాళ‌విక కోసం సోనూ ప్ర‌చారం చేస్తూ సోనూ సూద్ ఎన్నిక‌ల నిబంధనలను ఉల్లంఘించార‌ని అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ నేప‌ధ్యంలో ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని మోగాలోని పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకుండా ఎన్నికల సంఘం అధికారుల ముందుగానే సోనూ సూద్‌కు తెలిపారు. అయినా కూడా ఫిబ్రవరి 20 ఆదివారం పోలింగ్ రోజున‌, సూద్ తన స్వగ్రామమైన మోగాలో తిరుగుతూ కనిపించారు.

దీంతో సోనూసూద్‌పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోగాలో ఓటు హక్కు లేకుండా పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించడం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు అతని సోదరి మాళవికా సూద్ సచార్ ప్రచారం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఇత‌ర పార్టీ నేత‌లు ఫిర్యాదులు ఇచ్చారు. దీంతో సోనూ సూద్‌ పై అక్క‌డి పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణలపై ఆదివారం అర్థరాత్రి సోనూసూద్ పై పంజాబ్ పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 188 కింద కేసు నమోదు చేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సోనూసూద్‌పై కేసు నమోదు చేసినట్లు మోగా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దల్జీత్ సింగ్ తెలిపారు.