Punjab Governor:పంజాబ్లో ఆప్ సర్కారుకు షాకిచ్చిన గవర్నర్..

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Punjab

Punjab

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గవర్నర్ ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకొని, విశ్వాస తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది.

కానీ, ‘నిర్దిష్ట నియమాలు పాటించకపోవడంతో’ ఉత్తర్వును ఉపసంహరిస్తున్నట్టు గవర్నర్ బన్వరీలాల్ ప్రకటించారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు.

‘కేబినెట్ ఆమోదించిన సెషన్‌ను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారు? ఇలా అయితే ప్రజాస్వామ్యం ముగిసినట్టే. రెండు రోజుల క్రితం గవర్నర్‌ సెషన్‌కు అనుమతి ఇచ్చారు. కానీ, బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ విఫలమై.. అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో సెషన్ ను విత్ డ్రా చేయాలని పై నుంచి ఆదేశం వచ్చింది. నేడు దేశంలో ఒకవైపు రాజ్యాంగం ఉంటే.. మరోవైపు ఆపరేషన్ కమలం ఉంది’ అని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని అధికార ఆప్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ బలాన్ని నిరూపించుకుంటామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో పంజాబ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

ఆరు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆఫర్‌తో 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని అధికార పార్టీ ఇటీవల ఆరోపించింది. బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’లో భాగంగా రాష్ట్రంలోని ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కొన్ని రోజుల కిందట తమ శాసన సభ్యులను సంప్రదించారని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.

  Last Updated: 22 Sep 2022, 01:33 PM IST