Punjab Effect On TPCC : టీ కాంగ్ పై పంజాబ్ ఎఫెక్ట్‌?

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూకు పోలిక ఉందా? అస‌మ్మ‌తి రాజేయ‌డంలో ఇద్ద‌రూ ఒక‌టేనా?

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 05:42 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూకు పోలిక ఉందా? అస‌మ్మ‌తి రాజేయ‌డంలో ఇద్ద‌రూ ఒక‌టేనా? సీనియ‌ర్ల‌ను టార్గెట్ చేయ‌డంలో ఒక‌టే వ్యూహ‌మా? ఎందుకు రేవంత్ రెడ్డి ని తెలంగాణ‌లోని కొంద‌రు సీనియ‌ర్లు సిద్ధూ నాయ‌క‌త్వంతో పోల్చుతున్నారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. రాబోవు రోజుల్లో రేవంత్ రెడ్డిని పీసీసీ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం కూడా ఊపందుకుంది.నిజంగా రేవంత్ రెడ్డిని పీసీసీ ప‌ద‌వి నుంచి త‌ప్పించే ధైర్యం కాంగ్రెస్ చేస్తుందా? అంటే ఇప్పుడున్న దూకుడును సోనియా కొన‌సాగిస్తే ఏదైనా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఆమె సిద్ధమైయింది. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం ప‌నిచేసే నాయ‌కులు రాష్ట్రాల్లో అవ‌స‌రం లేద‌ని ఆమె రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేసింది. కానీ, ఎవ‌రూ రాజీనామాల‌కు సిద్ధప‌డ‌క పోవ‌డంతో ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్ ల రాజీనామాకు ఆమె ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లోనూ పార్టీ రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాలంటూ ఈ నిర్ణయం తీసుకుంది.సోనియా ఆదేశంతో పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా చేశాడు. ఆ మేర‌కు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.

నిజానికి పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోకపోవడం వెనుక అంతర్గత కుమ్ములాటలే కారణమని అధిష్టానం భావించింది. సీఎం అమరీందర్ తో సిద్ధూకు పొసగలేదు. రాహుల్, ప్రియాంకకు సన్నిహితుడైన సిద్ధూ సీఎం పదవిలోని అమ‌రీంద‌ర్ ను తప్పించడంలో స‌ఫ‌లీకృతుడు అయ్యాడు. దాంతో అమరీందర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చన్నీతోనూ సిద్ధూ స‌ఖ్య‌త‌గా లేడు. ఫలితంగా సానుకూలంగా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది.పంజాబ్ అనుభ‌వంతో తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టి కాంగ్రెస్ అధిష్టానం పెట్టింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. ఇప్ప‌టికే ప‌లువురు రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు, భూ వివాదాలు, రాజ‌కీయ‌ప‌ర‌మైన అడుగులు త‌దిత‌రాల‌ను వ్య‌తిరేక గ్రూప్ ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీకి చేర‌వేస్తోంది. పైగా ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నం చేస్తోన్న వైనాన్ని పిన్ టూ పిన్ సోనియాకు ప్రత్య‌ర్థులు అంద‌చేశార‌ని వినికిడి. సీనియ‌ర్లు ఇప్ప‌టికీ రేవంత్ నాయ‌క‌త్వంపై తిరగ‌బ‌డుతున్నారు. ప్ర‌త్యేకించి జ‌గ్గారెడ్డి నేరుగా రేవంత్ రెడ్డి వాల‌కాన్ని త‌ప్పుబడుతున్నాడు. ఆయ‌న వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని వెల్ల‌డించాడు. సోనియాను క‌లిసి అన్ని విష‌యాలు ఆమెకు చెబుతాన‌ని ప్ర‌క‌టించాడు. తొలి నుంచి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా రేవంత్ మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. వెట‌రన్ లీడ‌ర్ గా ఉన్న వీహెచ్ మొద‌టి నుంచి రేవంత్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నాడు.
పంజాబ్ త‌ర‌హాలోనే తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయం ఉంద‌ని అధిష్టానం భావిస్తోంద‌ట‌. అందుకే, సోనియా రంగంలోకి దిగిన ప్ర‌స్తుతం త‌రుణంలో ఏ రోజైనా తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌క్షాళ‌న అనూహ్యంగా ఉంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. సో..రేవంత్ పీసీసీ ప‌ద‌వి ఉంటుందా? ఊడుతుందా? అనేది చూడాలి.