Hijab Issue : హిజాబ్ రాజాకీయాలు – కుట్ర కోణం

కర్నాటకలో మొదలైన హిజాబ్ రచ్చ దేశవ్యాప్తంగా పెద్ద చర్చాగా మారింది.

కర్నాటకలో మొదలైన హిజాబ్ రచ్చ దేశవ్యాప్తంగా పెద్ద చర్చాగా మారింది. విద్యార్థినిలు హిజాబ్ వేసుకొని కాలేజీకి రావడాన్ని అక్కడి హిందుత్వ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ దరిస్తే తాము కాషాయజెండాలు మెడలో దరిస్తామని అల్టిమేటం జారీచేశారు. తాజాగా ముస్కాన్ అనే విద్యార్థి హిజాబ్ దరించి కాలేజీకి రాగానే ఆమె చుట్టూ వందలాది హిందుత్వ ఫోర్సెస్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా ఆ విద్యార్థిని ఓక్కతే అల్లాహ్ అక్బర్ అంటూ నినాదాలు ఇస్తూ వాళ్ళని ఎదుర్కొంది. ఆ సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ గా మారి దేశవ్యాప్తంగా ఆ సంఘటనపై చర్చ నడుస్తోంది.

బురఖా, నఖాబ్, హిజాబ్ పై ఎప్పటినుండో బిన్నమైన అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. ఇవి ముస్లిం అమ్మాయిలపై ఆ సమాజపు పితృస్వామ్యం చేస్తోన్న అణచివేతగా చాలామంది లౌకికవాదులు అభిప్రాయ‌ప‌డ‌తారు.. అయితే ముస్లిం మహిళలు బురఖా, హిజాబ్ ధ‌రించ‌వ‌ద్ద‌ని హిందుత్వ ఇస్తున్న ఫత్వాలకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు వీటిని దరించడం ఒక సబాల్టర్న్ కల్చర్ గా చూడాలనేది మరో వాదన. మరోవైపు హిందూ సమాజంలో కూడా చాలా ప్రాంతాల్లో మహిళలు ముఖానికి పరదా వేసుకోవడం ఇప్పటికీ కొనసాగుతోందని, కానీ ప్రతిసారి కేవలం ముస్లింల వ‌స్త్ర‌ధార‌ణ‌ మాత్రమే చర్చనీయాంశంగా మారుతుండడంలో రాజకీయాలు ఉన్నాయని ప్రజాస్వామికవాదులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా కర్నాటకలో జరుగుతున్న విషయంపై హిందుత్వ వాదులు వాదిస్తున్న విషయాలను పరిశీలిస్తే.. విద్యాసంస్థల్లో యూనిఫారం ఉంటుంది. కచ్చితంగా దానినే వేసుకోవాలి తప్ప, మత చిహ్నాలైన హిజాబ్ ధ‌రించ‌డం సరైన పద్దతికాదనేది వారి అభిప్రాయం. అయితే అయ్యప్పమాల‌ధార‌ణ‌తో విద్యార్ధులు విద్యాసంస్థలకు వస్తే రానివ్వడం లేదని, తమ మతవిశ్వాసాలను దెబ్బతీస్తున్నారని వాదించిన వాళ్ళే నేడు పరమతస్తుల మతవిశ్వాసాలను దెబ్బతీయడం ఏంటని సెక్యులరిస్టులు ప్రశ్నిస్తున్నారు.

అన్ని మతాల్లో ఆచారాలు, సంప్రదాయాలు మహిళలకే ఉన్నాయని, ఇవి మహిళలని మరింత బానిసత్వంలోకి నెత్తి వేస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చగా మారింది. హిజాబ్ విషయంలో కొన్ని సమూహాలు కావాలానే అనవసరపు చర్చను చేస్తున్నాయని, దేశంలోని ప్రజలను మతాల పేరుతో విడదీసి రాజకీయ లబ్ది పొందాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తాయని దేశంలో మేజర్ ఎన్నికలు జరిగే ప్రతి సమయంలో కావాలని ఇలాంటి ఒక చర్చను లేవనెత్తి కుట్ర చేస్తారని రాజకీయ పరిశీలకుల వాద‌న‌.

గతంలో వచ్చిన బుల్లి డీల్, సుల్లీ డీల్ అంశాలాతో పాటు ఇప్పుడు జరుగుతున్న హిజాబ్ అంశంలోనూ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది ఎక్కువగా టీనేజ్ విద్యార్థులే. తమ పిల్లలు అనవసరపు విషయాల్లో ఇరుక్కొకుండా వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని తల్లితండ్రులకు సైకాలజిస్టులు సూచిస్తున్నారు.