Rohini Court : న్యాయ వ్యవస్థ విశ్వాసంపై నీడలు పడే ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఢిల్లీ రోహిణి కోర్టులో చోటు చేసుకున్న సంఘటన అక్కడి బార్ అసోసియేషన్‌ను అప్రమత్తం చేసింది. న్యాయవాదులను పోలిన దుస్తులు ధరించి, మోసాలకు పాల్పడుతున్నట్లు వారు వెల్లడించారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన బార్ అసోసియేషన్ కొద్దిపాటి నిర్ణయాలు తీసుకుంది. బార్ అసోసియేషన్ విడుదల చేసిన నోటీసు ప్రకారం, కొంతమంది వ్యక్తులు తమను న్యాయవాదులు లేదా వారి సహాయకులుగా (గుమస్తాలు) పేర్కొంటూ కోర్టు పరిసరాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారట. వారు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి న్యాయవాది అనే మాయతో, సాధారణ ప్రజలను మోసం చేస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.
Read Also: Anil Chauhan : భారత సైన్యంలో ఆధునిక సాంకేతికత అవసరం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
ఈ నేపథ్యంలో, కోర్టు పరిసర ప్రాంతాల్లోని భద్రతను పెంచడమే కాకుండా, కొన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ఇకపై కోర్టు ప్రాంగణంలో తెల్ల షర్టు, నల్ల ప్యాంటు ధరించి రావడానికి న్యాయవాదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతరులెవరూ గుమస్తాలు, పిటిషనర్లు, సాధారణ పౌరులు అలాంటి దుస్తులు ధరించి కోర్టుకు రాకూడదని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ నిషేధం విధించడం ద్వారా, న్యాయవ్యవస్థను అపవిత్రం చేస్తున్న మోసగాళ్లను గుర్తించేందుకు, అడ్డుకునేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. గతంలోనూ న్యాయవాదుల సహాయకులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయడం జరిగినట్లు గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు అది చాలదన్న స్పష్టతతో, దుస్తుల మీద కూడా నియంత్రణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇటీవలి కాలంలో మోసాలు, నకిలీ న్యాయవాదులు, డూప్లికేట్ హాజరు, నకిలీ పిటిషన్ల వంటి చర్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్న నేపథ్యంలో, రోహిణి బార్ అసోసియేషన్ తీసుకున్న చర్యలను పలువురు న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ప్రజలు, కోర్టు విచారణ కోసం వచ్చే వారు కూడా ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కొత్త మార్గదర్శకాలను పాటించని వారు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని బార్ అసోసియేషన్ హెచ్చరించింది. నిజమైన న్యాయవాదుల గౌరవాన్ని కాపాడే దిశగా ఇది కీలక నిర్ణయమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.