Site icon HashtagU Telugu

Congress Makeover : కాంగ్రెస్ ప్ర‌క్షాళ‌న‌కు రంగంలోకి ప్రియాంక‌

Priyankagandhi

Priyankagandhi

ఐదు రాష్ట్రాల చేదు ఫ‌లితాల‌ను చూసిన త‌రువాత కాంగ్రెస్ పార్టీ భారీ ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుడుతోంది. ఇప్ప‌టికే పీసీసీల‌కు బ‌హిరంగ లేఖ రాసిన సోనియా సంస్క‌ర‌ణ‌ల‌కు సంకేతాలు ఇచ్చింది. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం పాకులాడే వాళ్ల‌ను ప‌క్క‌న పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది. పార్టీ కోసం ప‌నిచేయాల‌ని ఆదేశించింది. ఆ వ్యాఖ్య రేవంత్ రెడ్డి లాంటి వాళ్ల‌ను ఉద్దేశించి సోనియా లేఖ‌లో పొందుప‌రిచార‌ని ఆయ‌న వ్య‌తిరేక గ్రూపు భావిస్తోంది.యూపీలో ప్రియాంక ఎంత ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ రెండు శాతానికి మించి ఓట్లు రాలేదు. కేవ‌లం రెండు స్థానాల‌కు మాత్ర‌మే కాంగ్రెస్ పరిమితం కావ‌డం ఆ పార్టీని కుదిపేస్తోంది. అందుకే, ఆఫీస్ బేర‌ర్లు, కీల‌క లీడ‌ర్ల‌తో ప్రియాంక మీటింగ్ నిర్వ‌హించింది. సంస్థాగ‌తంగా భారీ మార్పులు చేయ‌డానికి ఆమె సిద్ధ ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తాజాగా జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ మీటింగ్ లో కూడా ప్రియాంక నాయ‌క‌త్వానికి పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

అధికారంలో ఉన్న పంజాబ్ తో పాటు నాలుగు రాష్ట్రాల‌ను చేజిక్కించుకోలేక‌పోయిన కాంగ్రెస్ భారీ ప్ర‌క్షాళ‌న‌కు తెర‌లేపింది. దేశ వ్యాప్తంగా నాయ‌క‌త్వ మార్పులు అనూహ్యంగా ఉంటాయ‌ని లీడ‌ర్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ భావ‌జాలం ఉన్న లీడ‌ర్ల‌కే పెద్ద పీఠ వేయాల‌ని సోనియా నిర్ణ‌యం తీసుకుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. అనాదిగా కాంగ్రెస్ పార్టీని క‌నిపెట్టుకుని ఉంటోన్న లీడ‌ర్ల‌ను కాద‌ని నాయ‌క‌త్వ మార్పులు చేయ‌డం కార‌ణంగా పంజాబ్ దెబ్బ‌తిన్న‌ద‌ని ఆ పార్టీకి బోధ‌ప‌డింది. అందుకే, మ‌రోసారి అలాంటి త‌ప్పులు ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూనే జ‌రిగిన త‌ప్పుల‌ను దిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలోనే ప్రియాంక యూపీ నుంచి ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుట్ట‌బోతోంది.
ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం డిజిట‌ల్ రూపంలో జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా స‌భ్య‌త్వాల‌ను పూర్తి స్థాయిలో ముగిసిన త‌రువాత సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తి చేస్తారు. ఆ త‌రువాత పీసీసీ అధ్య‌క్షుల‌ను కొన్ని రాష్ట్రాల్లో మార్పు చేసే అవ‌కాశం ఉంది. అంతిమంగా ఈ ఏడాది ఆగ‌స్ట్ నాటికి ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం స్కెచ్ వేసింది. ఆ మేర‌కు ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొవ‌డానికి సానుకూల అంశాల‌ను అధ్య‌య‌నం చేస్తోంది. ప్ర‌స్తుతం సోనియా నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రుస్తూ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయి అధ్యక్షునిగా రాహుల్ ను నియ‌మించాల‌ని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కోట్లాది మంది భారతీయుల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించ‌డానికి సిద్ధం అవుతోంది. 2022 మరియు 2023 రాష్ట్రాలలో ఎన్నికల సవాళ్లు అలాగే 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవ‌డానికి “CWC ఏకగ్రీవంగా సోనియా గాంధీ నాయకత్వంపై తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. కానీ, సంస్థాగత బలహీనతలను పరిష్కరించ‌డంతో పాటు ఏఐసీసీని బ‌లోపేతం చేయ‌డానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఆ ప్ర‌క్రియ ఈ ఏడాది ఆగ‌స్ట్ నాటికి ముగుస్తుంద‌ని తెలుస్తోంది. అప్పుడు రాహుల్ కు ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని ఢిల్లీ టాక్‌.