Palestine On Handbag : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ‘పాలస్తీనా’ దేశం పేరుతో ఉన్న హ్యాండ్ బ్యాగును ధరించి ఇవాళ పార్లమెంటుకు వచ్చారు. పాలస్తీనా దేశానికి సంఘీభావంగా ఆమె ఈ హ్యాండ్ బ్యాగును ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఫొటోను ప్రియాంకాగాంధీ తన ఎక్స్ అకౌంటులో పోస్ట్ చేస్తూ.. ‘‘ కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు గుర్తుగా ఈ హ్యాండ్ బ్యాగ్‌ను ధరించాను. జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు’’ అని వ్యాఖ్యానించారు. పాలస్తీనా పేరుతో ఉన్న బ్యాగును ధరించి ప్రియాంకాగాంధీ పార్లమెంటులోకి వెళ్తున్న వీడియోను ఏఎన్ఐ వార్తాసంస్థ పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలస్తీనా ప్రజల సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ గుర్తు కూడా ఆమె బ్యాగ్‌పై కనిపించింది.
Also Read :Zakir Hussain Disease : ఐపీఎఫ్.. జాకిర్ హుస్సేన్ మరణానికి కారణమైన వ్యాధి వివరాలివీ
గత మంగళవారం రోజు భారత్‌లోని పాలస్తీనా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్.. ప్రియాంకాగాంధీని కలిశారు. వయనాడ్ ఎంపీగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాలస్తీనా ఉద్యమ నేత యాసర్ అరాఫత్ మధ్య జరిగిన చర్చల ఫొటోను ప్రియాంకకు కానుకగా అబూ జాజర్ అందజేశారు. రాజ్యాధికారం కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి ఆసందర్భంగా ప్రియాంక మద్దతును ప్రకటించారు. దాదాపు 50వేల మంది పాలస్తీనా ప్రజల ప్రాణాలను ఇజ్రాయెల్ తీయడాన్ని ఆమె ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీరు నిరంకుశంగా ఉందన్నారు. కాగా, ఈ బ్యాగును ప్రియాంక(Palestine On Handbag) ధరించడంపై బీజేపీ ఎంపీ గులాం అలీ ఖతానా తీవ్రంగా స్పందించారు. ‘‘వార్తల్లోకి వచ్చేందుకు.. ప్రజల చూపును ఆకట్టుకునేందుకే ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రజల తిరస్కారం ఎదురైన వారు.. ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.