జమ్మూకశ్మీర్ అనేది ఎప్పటికీ మన దేశానికి సెంటిమెంటే. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రసంగాల్లో దీని ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఒక్క ప్రశ్న తలెత్తుతోంది. మోదీ.. కేవలం జమ్మూ పర్యటనకే ఎందుకు పరిమితమవ్వాలనుకున్నారు? కశ్మీర్ లో ఎందుకు పర్యటించాలనుకోలేదు? ఇప్పుడు ప్రతిపక్షాల సూటి ప్రశ్న ఇదే.
2019లో జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆయన టూర్ మాత్రం జమ్మూకే పరిమితమైంది. దీంతో స్థానిక ప్రజల్లో నిరాశ తప్పలేదు. ఎందుకంటే ఆయన కశ్మీర్ కు కూడా వస్తే.. అక్కడి పరిస్థితులను చూడడానికి, దాని ప్రకారం అభివృద్ధికి మరిన్ని చర్యలను తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకున్నారు.
ప్రధాని పర్యటనకు ముందు జమ్మూ సరిహద్దు జిల్లా సాంబాలోని సుంజ్వాన్ సైనిక శిబిరానికి దగ్గరలో తీవ్రవాదులు.. ఓ బస్సుపై దాడి చేశారు. జమ్మూలో ఈ దాడికి.. కొన్ని గంటల ముందే.. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్ల ప్రాంతంలో సైనికులకు, టెర్రరిస్టులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ముగ్గురు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు ఆర్మీ అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వానికి అర్థమైంది.
గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ లో పర్యటించారు. అప్పుడు కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు కూడా అంతే. అయితే ఇక్కడి పరిస్థితులు మారాలంటే సంస్థాగతంగా ఇంకా చాలా మార్పులు రావలసి ఉంది. దీనికోసం అటల్ బిహారీ వాజ్ పేయి తరహాలో కశ్మీర్ పై సయోధ్య వైఖరిని తీసుకోవాలన్న డిమాండ్ ఉంది. కశ్మీర్ లో రాజకీయపార్టీలు ఇప్పటికే ఈ విషయంపై మోదీని రిక్వెస్ట్ చేశాయి.