PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ ఐదు రోజుల పాటు మూడు కీలక దేశాలను సైప్రస్, కెనడా (Canada), క్రొయేషియా సందర్శించనున్నారు. జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్‌తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్‌కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. ఈ పర్యటనలో మోడీ అక్కడి అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యాపారవేత్తలను ఉద్దేశించి ముఖ్యమైన ప్రసంగం చేయనున్నారు.
Read Also: Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్‌కి ప్రభుత్వ గౌరవం
ఇరు దేశాల మధ్య వ్యాపార, నౌకాశ్రయ, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై కూడా చర్చలు జరుగనున్నాయి. ముఖ్యంగా మధ్యధరా ప్రాంతంతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా సైప్రస్‌తో మోడీ చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సైప్రస్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ నేరుగా కెనడాకు వెళ్లనున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంతో జూన్ 16-17 తేదీల్లో అల్బర్టా రాష్ట్రంలోని కననాస్కిస్‌లో జరగనున్న జీ-7 సదస్సులో పాల్గొననున్నారు. ఇది మోడీకు వరుసగా ఆరోసారి జీ-7 సమ్మిట్‌లో హాజరు కావడం. ఈ సదస్సులో మోడీ గ్లోబల్ ఎన్ర్జీ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న సాంకేతికత, గ్లోబల్ సప్లై చైన్ల భద్రత వంటి కీలక అంశాలపై జీ-7 దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు.
అంతేగాక, జీ-7 దేశాల్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల అధిపతులతో సమావేశాలు జరగనున్నాయి. జూన్ 18న ప్రధాని మోడీ తన పర్యటనలో చివరి దశగా క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని క్రొయేషియా దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల ప్రారంభానికి చిహ్నంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్-క్రొయేషియా మధ్య ఇన్నాళ్లుగా ఉన్న సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య, పర్యాటక రంగాలలో సహకారాన్ని పటిష్టం చేయడానికి ఈ పర్యటన దోహదపడనుంది. ఈ విదేశీ పర్యటనతో ప్రధానమంత్రి మోడీ నూతన అంతర్జాతీయ సంబంధాల పోటీ వేదికపై భారత్‌కు మరింత గౌరవాన్ని, వ్యాపార సహకారాన్ని తీసుకురావడమే కాక, భవిష్యత్తు భారత విదేశాంగ విధానాలకు మార్గనిర్దేశకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.