PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో జరుగనున్న ఎనిమిది రోజుల విదేశీ పర్యటన కోసం సిద్ధమవుతున్నారు. జులై 2న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాలు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా సందర్శించనున్నారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాలను సందర్శించనున్నది ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మొదట జులై 2, 3 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటిస్తారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే అవకాశాలపై వీరు చర్చించనున్నారు.
Read Also: Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
అంతకుముందు జులై 3, 4 తేదీల్లో ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శించనున్నారు. 1999 తర్వాత ఈ ద్వీపదేశాన్ని భారత ప్రధాని పర్యటించనడం ఇదే తొలిసారి. ఇక్కడి భారత సంతతి ప్రజలతో మోడీ భేటీ అయ్యే అవకాశమూ ఉంది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ప్రజలతో ప్రజల అనుబంధాన్ని మరింత బలపరిచే ప్రయత్నం జరుగుతుందని భావిస్తున్నారు. తర్వాత, ప్రధాని మోడీ జులై 4 నుంచి 5వ తేదీ వరకు దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిలేతో రక్షణ, వ్యవసాయం, మైనింగ్, ఇంధన, వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించే అంశాలపై ఆయన చర్చించనున్నారు. అర్జెంటీనా పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని విదేశాంగ శాఖ పేర్కొంది.
అనంతరం జులై 5 నుంచి 8వ తేదీ వరకు మోడీ బ్రెజిల్‌లో పర్యటిస్తారు. రియో డి జనెరోలో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ప్రధాని అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఈ సందర్బంగా ఇతర బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో కూడా మోడీ ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. అంతిమంగా జులై 9న నమీబియాను ప్రధాని సందర్శిస్తారు. అక్కడి నాయకులతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే, నమీబియా పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగించే అవకాశం కూడా ఉందని సమాచారం. నమీబియాతో ఉన్న చారిత్రక సంబంధాలను పునరుద్ఘాటించే విధంగా ఈ పర్యటన ఉండనుంది. ఈ విదేశీ పర్యటన ద్వారా భారతదేశం గ్లోబల్ సౌత్ దేశాల మధ్య తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు, ఆర్థిక సహకారాన్ని, ప్రాదేశిక సమన్వయాన్ని పెంపొందించాలనే దృష్టితో ప్రధాని పర్యటన సాగనుంది. గత పదకొండు ఏళ్లలో మోదీ చేపట్టిన అత్యంత సుదీర్ఘ విదేశీ పర్యటనలలో ఇదీ ఒకటిగా నిలవనుంది.
Read Also: Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర నిపుణుల కమిటీ