దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభావార్త వినిపించింది. 11 నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గిస్తున్నట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దేశంలో వంటనూనెల ధరలను స్థిరంగా ఉంచేందుకు దిగుమతులపై ఉన్న రాయితీని కేంద్రం పండగల వేళ మరో ఆరు నెలల పాటు పొడిగించింది.
ఈ రాయితీని వచ్చే ఏడాది మార్చి 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ నెలలో 11 నిత్యావసర ఆహార పదార్థాల సగటు ధరలు 2 నుంచి 11శాతం వరకు తగ్గుముఖం పట్టాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు దిగివచ్చినట్లు మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పామాయిల్ ధర రూ. 132 నుంచి రూ. 118కి తగ్గింది. వనస్పతి నెయ్యి కిలో రూ. 152 నుంచి రూ. 143కి రాగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 176 నుంచి రూ. 165కి.. సోయాబీన్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 156 నుంచి రూ.148కి చేరింది. ఆవనూనె ధర లీటర్‌కు రూ. 173 నుంచి రూ. 167కు, శనగనూనె లీటర్‌కు రూ. 189 నుంచి రూ. 185కు వచ్చింది. పప్పు ధాన్యాలు, పప్పులు కిలో రూ. 74 నుంచి రూ. 71కి రాగా.. బంగాళదుంప ధర కిలో రూ. 28 నుంచి రూ. 26కి పిడిపోగా.. ఉల్లిగడ్డలు ధర కిలో రూ. 26 నుంచి రూ. 24కి చేరాయని మంత్రి తెలిపారు.