Site icon HashtagU Telugu

Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

President's rule extended in Manipur

President's rule extended in Manipur

Manipur : మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, శాంతి భద్రతల సమస్యల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 13, 2025 నుంచి ఈ పొడిగింపు అమలులోకి రానుంది. తద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్‌ రాష్ట్రం కేంద్ర హస్తాల్లోనే కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ చర్చల్లో మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అయినప్పటికీ, రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు రాష్ట్రపతి పాలన అవసరమనే అభిప్రాయంతో ప్రభుత్వం ముందడుగు వేసింది.

గత సంవత్సరం మే నుంచే మణిపూర్‌లో అల్లర్లు

2023 మే నెలలో మైతేई మరియు కుకి తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు మణిపూర్‌ను తాకిన తీవ్రమైన సంక్షోభానికి నాంది పలికాయి. అప్పటినుంచి ఆ రాష్ట్రం అస్థిరత భయంకరంగా పెరిగింది. తెగల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో సుమారు 250మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి సామాన్య ప్రజల వలస బారిన పడ్డారు. ఈ ఘర్షణల ప్రభావంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చెలరేగింది. విపక్షాల ఒత్తిడి, ప్రజా నిరసనల మధ్య 2025 ఫిబ్రవరి 13న సీఎం ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే రోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ కేంద్ర పాలనలో కొనసాగుతోంది.

శాసనసభ కాలపరిమితి 2027 వరకూ

ఇప్పటి శాసనసభ కాలం 2027లో ముగియనుంది. అయినప్పటికీ, గత 21 నెలలుగా మణిపూర్‌లో పరిస్థితులు సద్దుమణగకపోవడం, తెగల మధ్య మౌలిక సంఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రజలు నిత్యం భయంలో జీవిస్తున్నారు. ప్రజా జీవితానికి తిరుగులేని దెబ్బ తగలడమే కాకుండా, విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలన్నీ స్థంభించిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేకపోవడం వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతి పాలనను కొనసాగించాలని భావించింది. శాంతి నెలకొనగానే ప్రజాప్రాతినిధ్యాన్ని తిరిగి ప్రజలకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.

శాంతి పునరుద్ధరణకు ప్రయత్నాలు

మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్చలు, ప్రయత్నాలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెగల మధ్య అభిప్రాయ భేదాలను తేల్చేందుకు సామాజిక నేతలు, మతపరమైన పెద్దలతో మంతనాలు జరిపే పనిలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను మోహరించినప్పటికీ, ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.ఈ క్రమంలో రాష్ట్రపతి పాలనకు పొడిగింపు అనివార్యమైందని, ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్రం తెలిపింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు హామీ ఇచ్చాయి.

Read Also: Rajasthan School Collapse : రాజస్థాన్‌లో పాఠశాల భవనం కూలి విషాదం..