Centenary Celebrations : నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శత జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ను బుధవారం ఉదయం సందర్శించారు. ఈ క్రమంలో వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాజ్పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో మోడీ ఓ ఆర్టికల్ రాశారు. అటల్‌జీ తన పార్లమెంట్ కాలంలో.. ఎక్కువ శాతం ప్రతిపక్ష బెంచ్‌లకే పరిమితమైనట్లు చెప్పారు. ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పట్ల విస్మయాన్ని ప్రదర్శించలేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అటల్‌జీని దేశద్రోహి అని ఆరోపించిందన్నారు. 21వ శతాబ్ధం వైపు మళ్లించిన శిల్పి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన సంస్కర్త అటల్‌జీ అని తెలిపారు. ఆశ్రితపక్షపాత ఆర్ధిక విధానాలకు ఆయన చరమగీతం పాడినట్లు చెప్పారు.
ఆయన నాయకత్వ నైపుణ్యం సుదీర్ఘ కాలం అనేక రంగాలపై ప్రభావం చూపిందన్నారు. వాజ్‌పేయి అధికారంలో ఉన్న సమయంలో.. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం అండ్ కమ్యూనికేషన్స్ రంగాలు విశేష ప్రగతిని సాధించాయన్నారు. మాజీ ప్రధాని అటల్.. ఓ రాజనీత్జుడు అని, ఆయన నిత్యం ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నారన్నారు. 90 దశకంలో దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నదని, 9 ఏళ్లలో నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయని, ఆ సమయంలో వాజ్‌పేయి స్థిరమైన, ప్రభావంతమైన పరిపాలన అందించినట్లు చెప్పారు. సాధారణ ప్రజల పోరాటాన్ని వాజ్‌పేయి గుర్తించారన్నారు.
సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆయన ఆధునిక విద్యను అందించే ప్రయత్నం చేశారన్నారు. న్యూక్లియర్ పరీక్షలు చేపట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎదుర్కొన్న తీరు వాజ్‌పేయి నాయకత్వాన్ని చాటుతుందన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఢిల్లీ మోట్రోకు కూడా వాజ్‌పేయి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గోల్డెన్ క్వాడ్రిలెటరల్ ప్రాజెక్టు కూడా ఆయన కీర్తిని పెంచిందన్నారు.