Site icon HashtagU Telugu

PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్

Preparing for compromise with China is cruel: Jairam Ramesh Fire

Preparing for compromise with China is cruel: Jairam Ramesh Fire

PM Modi : టియాంజిన్‌ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై దేశీయ రాజకీయాల్లో భగ్గుమన్నట్లయింది. ఈ భేటీ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు. ఆ సైనికుల త్యాగాలను తక్కువ చేసి, చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం. దేశానికి గౌరవం ఉన్న ప్రధాని ఇలా వ్యవహరించరాదు అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రధాని మోడీ గతంలో చైనా గడ్డ దాటి రాలేదని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అదే మాటలు చైనా దురాక్రమణలకు మద్దతుగా మారాయని విమర్శించారు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆర్మీ చీఫ్ కోరుతున్నారు. కానీ ప్రభుత్వం సయోధ్య దిశగా అడుగులు వేయడం వల్ల చైనా ఆక్రమణకు చట్టబద్ధత కలుగుతోంది అని జైరాం విమర్శించారు. అంతేకాక, ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సందర్భంలో పాకిస్థాన్‌తో చైనా కలిసి పనిచేస్తోందని, భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ 2025 జూలై 4నే వివరించిన విషయాన్ని జైరాం రమేశ్ గుర్తు చేశారు. చైనా–పాక్ పొత్తు భారత్‌కు తీవ్రమైన సవాలుగా మారింది. అయినా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం శోచనీయమైంది. ఇప్పుడు చైనా నేతకు మోడీ ఇచ్చిన రాచమర్యాదలే ఇందుకు నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. జైరాం రమేశ్ చైనా ఆర్థిక వ్యూహాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయంగా చైనా ఉత్పత్తుల డంపింగ్ విపరీతంగా పెరిగింది. ఇది మన చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

MSME రంగం నెమ్మదిగా కుంగిపోతోంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈశాన్య భారత రాష్ట్రాలకు భయంకర ముప్పుగా మారే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి మేనేజ్‌మెంట్‌పై చైనా ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలు మన జలసాధనాల భద్రతకు ప్రమాదం అని జైరాం హెచ్చరించారు. ఇక, మరోవైపు అధికార వర్గాల ప్రకారం, మోడీ, జిన్‌పింగ్ భేటీలో ఆర్థిక సహకారం, పరస్పర అవగాహన బలోపేతం, శాంతియుత సహవాసం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య మైత్రి సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, ఆర్థిక పురోగతికి దోహదపడే విధంగా కలిసి పనిచేయాలని నేతలు ఒకాభిప్రాయానికి వచ్చారని సమాచారం. అయితే ఈ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతమైన విమర్శలు, ప్రభుత్వంపై పెట్టిన సూటి ప్రశ్నలు దేశ భద్రత, విదేశాంగ విధానాలపై మరిన్ని చర్చలకు దారితీయనున్నాయి. చైనా వ్యవహారంలో పారదర్శకత, గట్టి నిర్ణయాల అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also:  KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్