Assembly Elections : శరద్ పవార్.. రాజకీయ కురువృద్ధుడు. ఆయన ఏదైనా చెబితే దాని వెనుక పెద్ద పరమార్ధమే దాగి ఉంటుంది. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లోగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రకటించారు. సోమవారం రోజు ఎన్సీపీ 25వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పవార్ తన కుమార్తె బారామతి ఎంపీ సుప్రియా సూలే, ఇతర నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివర్లోగా ఎన్నికలు(Assembly Elections) రావొచ్చన్నారు. అందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) పార్టీకి భారీ విజయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు , మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అధికారం కేవలం ఒకరిద్దరి చేతుల్లో ఉండకూడదనే విషయాన్ని ప్రజలు ఎన్నికల తీర్పు రూపంలో తెలియజేశారు’’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకారమే త్వరలో మహారాష్ట్రలోనూ పెనుమార్పును అందరూ చూడబోతున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి పక్షాలకు లభించిన ఫలితాలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు.
Also Read : Melbourne Telangana Forum : మెల్‌బోర్న్‌లో ‘తెలంగాణ’ సాంస్కృతిక సందడి
కాగా, శరద్ పవార్ 1999 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. ఇక మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితుల దృష్యా ఈ ఏడాది ప్రారంభంలో శరద్ పవార్ రాజకీయ పార్టీ ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి.. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లాడు. పార్టీ పేరు, గుర్తు విషయంలో అజిత్ పవార్, శరద్ పవార్‌లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా.. ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు అజిత్ పవార్‌కే దక్కుతాయనే ఆదేశాలు వెలువడ్డాయి. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అజిత్ పవార్‌కే వాటిపై హక్కు ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. దీంతో శరద్ పవార్ తన పార్టీ పేరును నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ)గా మార్చుకున్నారు. బూరుగ ఊదుతున్న వ్యక్తిని పార్టీ గుర్తుగా ఈసీ కేటాయించింది.