Site icon HashtagU Telugu

Prashant Kishor Blue Print: కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ఇదే.. పీకే అసలు లాజిక్ మిస్సయ్యారా?

prashant congress

prashant congress

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీకి బ్లూప్రింట్ ఇచ్చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. మొత్తం 17 రాష్ట్రాల్లో 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాల్సిందే అని తేల్చేశారు. ఇక పొత్తుల విషయానికి వస్తే.. తెలంగాణలో ఎవరితోనూ ఎలాంటి బంధం వద్దని చెప్పేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీతో జట్టు కట్టాలని సూచించారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. కాంగ్రెస్ పై వ్యతిరేకతతో పుట్టిందే వైసీపీ. మరి ఈ రెండు పార్టీలకు పొత్త సాధ్యమేనా? అంటే ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఏపీలో ఇప్పటికే వైసీపీకి సేవలు అందించారు ప్రశాంత్ కిషోర్. ఆయన ఎన్నికల వ్యూహాల వల్లే ఏపీలో వైసీపీ గెలిచింది. అందుకే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరేలా చేస్తారంటున్నారు.

ఇక తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్.. మహారాష్ట్రలో ఎన్సీపీతో, జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని సూచించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే జట్టు ఉన్న పార్టీలతోను, జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఈ పార్టీలు మొత్తం 128 స్థానాల్లో గెలిచాయని గుర్తుచేశారు. పైగా ఇంకో 249 నియోజకవర్గాల్లో రెండో ప్లేసులో ఉన్నాయి. అంటే అక్కడ కాంగ్రెస్ ఓటుబ్యాంకు వాటికి కలిస్తే… కచ్చితంగా విజయం సాధించే ఛాన్సుంది.

ఈ పార్టీలన్నీ తొలి రెండు స్థానాల్లో ఉన్న సీట్లు ఎన్ని అని చూస్తే.. మొత్తం 377 అవుతాయి. అందుకే పీకే కూడా టార్గెట్ 370 అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో ఫేస్ టూ ఫేస్ తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి.. అక్కడ సత్తా చాటుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినట్టు తెలుస్తోంది.

పార్టీలో ఎలాంటి సంస్థాగత మార్పులు అవసరం అని చెప్పారంటే.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని చెప్పారు. మరో రెండు ప్రతిపాదనలు కూడా చేశారు. యూపీఏ ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ లో సీనియర్ నేతను పెట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఉండడం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని చేయడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్ ను ఎన్నుకోవాలి. కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకగాంధీకి బాధ్యతలు అప్పజెప్పడం. మరో ప్రతిపాదనను చూస్తే.. యూపీఏ ఛైర్ పర్సన్ బాధ్యతలను సోనియా చూడాలి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని నియమించాలి. రాహుల్, ప్రియాంకలకు తొలి ప్రతిపాదనలో ఉన్న పదవులే అప్పజెప్పాలి. మరి ఈ మార్పులకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version