Prashanth Kishor : పీకే `50-50` గ్రాఫ్

తెలివైన వాడు విజ‌యాల‌ను మాత్ర‌మే ఫోక‌స్ చేసుకుంటాడు. అప‌జ‌యాల‌ను దాచిపెడ‌తాడు. ఆ విష‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ విజ‌య‌వంతం అయ్యాడు.

  • Written By:
  • Publish Date - December 3, 2021 / 03:45 PM IST

తెలివైన వాడు విజ‌యాల‌ను మాత్ర‌మే ఫోక‌స్ చేసుకుంటాడు. అప‌జ‌యాల‌ను దాచిపెడ‌తాడు. ఆ విష‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ విజ‌య‌వంతం అయ్యాడు. ఆయ‌న విజ‌యాల‌కు స‌మానంగా అప‌జ‌యాలు కూడా లేక‌పోలేదు. పేట్ పే చ‌ర్చ అంటూ 2017లో జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీని పీక‌ల్లోతు క‌ష్టాలోకి ప్ర‌శాంత్ కిషోర్ తీసుకెళ్లాడు. ఆనాడు పీకే చెప్పిన‌ట్టు వ్యూహాల‌ను కాంగ్రెస్ అనుస‌రించింది. ఘోర‌మైన ఓట‌మిని కాంగ్రెస్ పార్టీ 2017 యూపీ ఎన్నిక‌ల్లో చ‌విచూసింది.ఢిల్లీ ఎన్నిక‌ల్లోనూ ఆప్ కు వ్య‌తిరేకంగా పీకే వ్యూహాల‌ను ర‌చించాడు. కానీ,కేజ్రీవాల్ మూడుసారి విజ‌య‌ప‌థాన న‌డిచాడు. అక్క‌డ ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోవ‌డానికి కార‌ణం పీకే ఇచ్చిన పిచ్చి స‌ల‌హాలు, సూచ‌న‌లు. కానీ, ఏ రోజూ ఆ అప‌జ‌యాన్ని పీకే త‌న ఖాతాలో వేసుకోలేదు. కాంగ్రెస్ వైఫ‌ల్యం కింద‌నే జ‌మ‌క‌ట్టాడు.

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా 2014 ఎన్నిక‌ల నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు బాగా వినిపించింది. ఆ ఎన్నిక‌ల్లో మోడీ హ‌వా దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోంది. ఎవ‌రొచ్చి మ‌ద్ధ‌తు ఇస్తామ‌న్నా..బీజేపీ తీసుకుంది. ఆ స‌మ‌యంలో ప‌నిచేస్తాన‌ని వెళ్లిన పీకేకు బీజేపీ అవ‌కాశం ఇచ్చింది. ఛాయ్ పే చ‌ర్చ అంటూ ఆనాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా పీకే బాగా ప్రచారం చేశాడు. అప్ప‌టికే 10ఏళ్ల యూపీయేపై వ్య‌తిరేక‌త ఉన్న ప్ర‌జ‌లు మోడీ ప్ర‌సంగాల‌కు, హామీల‌కు ప‌డిపోయారు. ఆ వేవ్‌లో మోడీతో పాటు పీకేకి కూడా పేరొచ్చింది.ఆ త‌రువాత బీహార్ ఎన్నిక‌ల్లో ఆర్జేడీ, జేడీయూ(యూ)ల‌ను జ‌త చేయ‌డంలో కొంత వ‌ర‌కు పీకే విజ‌యం సాధించాడు. లాలూ ప్ర‌సాద్ యాదవ్‌తో నితీష్ క‌ల‌వ‌డం చారిత్ర‌క తప్పిందంగా ఆనాడు బీహారీలు భావించారు. అయిన‌ప్ప‌టికీ స్వ‌ల్ప మోజార్టీతో మాత్ర‌మే అధికారాన్ని నితీష్ పొంద‌గ‌లిగాడు. ఆ త‌రువాత బీజేపీతో చేతులు క‌ల‌పాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం సీఎంగా నితీష్ ఉన్నాడంటే..కేవ‌లం బీజేపీ చ‌లువే. ఒక‌ప్పుడు ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో ఉన్న నితీష్ కుమార్ చారిత్ర‌క త‌ప్పులు రాజ‌కీయాల్లో చేశాడు. అందుకు కార‌ణం పీకే. ఫ‌లితంగా ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ బీహార్‌కు ప‌రిమితం అయింది.
ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌ను వ‌ద్ద‌నుకున్న బీజేపీ 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త‌మైన విజ‌యాన్ని అందుకుంది. ఆ స‌మయంలో క్రేజ్ ఉన్న జ‌గ‌న్ పంచ‌న పీకే చేరాడు. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను సీఎంను చేయ‌గ‌లిగాడు. ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త‌ను సీఎంగా చేయ‌గ‌లిగాడ‌ని పీకే మీద చాలా మందికి న‌మ్మ‌కం ఉంది. కానీ, గెలిచే వాళ్ల‌ను మాత్ర‌మే ఆయ‌న ఆశ్ర‌యిస్తాడ‌ని చాలా మందికి తెలియ‌దు. ఆ కోణంలోనే ఇటీవ‌ల రాహుల్ గాంధీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వెళ్లాల‌ని భావించాడు.

కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు ఏఐసీపీతో క‌లిసి పీకే న‌డిచాడు. యూపీఏ ప‌క్షాల‌ను ఏకం చేయ‌డానికి ఢిల్లీలో మీటింగ్ పెట్టించాడు. ఆ స‌మ‌యంలో ఏమైందోగానీ…ఆనాటి నుంచి శ‌ర‌ద్ ప‌వార్ పంచ‌న చేరాడు. కాంగ్రెస్‌, బీజేపీ యేత‌ర ఫ్రంట్ దిశ‌గా వెళ్ల‌డానికి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ఇస్తున్నాడు. ఆ క్రమంలోనే ముంబాయ్ లో తాజాగా ఒక స‌మావేశం జ‌రిగింది. ఆ త‌రువాత యూపీఏ ఫార్ములా ఫెయిల్యూర్ అంటూ మ‌మ‌త సంచ‌ల‌న ప్ర‌కట‌న చేసింది. దానికి ఆజ్యం పోస్తూ రాహుల్ పై పీకే సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.గత 10 ఎన్నికల్లో పార్టీ 90% కంటే ఎక్కువ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఎలా యూపీఏను న‌డ‌ప‌గ‌ల‌ద‌ని పీకే ప్ర‌శ్నిస్తున్నాడు. లఖింపూర్ ఖేరీ సంఘటన తర్వాత గ్రాండ్-ఓల్డ్-పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్షం అంటూ రెండు నెల‌ల క్రితం పీకే విమ‌ర్శించాడు. వార‌స‌త్వ రాజ‌కీయం గురించి ప్ర‌స్తావించాడు. యూపీలో బ‌ల‌హీన ప్ర‌తిప‌క్ష‌మంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశాడు.
ఇదంతా గ‌మ‌నిస్తే..కాంగ్రెస్ పార్టీ, పీకే మ‌ధ్య ఏదో విభేదం నెల‌కొంద‌ని అర్థం అవుతోంది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకేను కాంగ్రెస్ పార్టీ అంగీకరించ‌లేద‌ని తెలుస్తోంది. పైగా పీకే చేస్తోన్న థ‌ర్డ్ ఫ్రంట్ వ్య‌వ‌హారం కూడా న‌చ్చ‌లేద‌ట‌. గాంధీ కుటుంబాన్ని కాద‌ని థ‌ర్డ్ ఫ్రంట్ దిశ‌గా పీకే అడుగులు వేశాడ‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. అందుకే, ప్ర‌శాంత్ కిషోర్‌ను ఏఐసీసీ ప‌క్క‌న‌ప‌డేసింద‌ట‌. ఆ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల కోసం పీకే దేశ వ్యాప్తంగా అన్వేషిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం మ‌మ‌త భుజంమీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చేయాల‌ని చూస్తున్నాడు. ఆయ‌న ప్ర‌య‌త్నం అప‌జ‌యాల జాబితాలోకి వెళుతుందా? విజ‌యాల ఖాతాలోకి వెళుతుందా? అంటే ఫిప్టీ ఫిప్టీ ఛాన్స్ ఉంద‌న్న‌మాట‌.