Bihar Politics : బీహార్లో పీకే `జ‌న్ సురాజ్‌` దుమారం

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ బీజేపీ ఏజెంటా? జేడీయూ ఆంత‌రంగీకుడా? అనే వాద‌న బీహార్ కేంద్రంగా బ‌య‌లు దేరింది.

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 12:29 PM IST

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ బీజేపీ ఏజెంటా? జేడీయూ ఆంత‌రంగీకుడా? అనే వాద‌న బీహార్ కేంద్రంగా బ‌య‌లు దేరింది. `జ‌న్ సురాజ్‌` పేరుతో ఆయ‌న పాద‌యాత్ర‌కు పూనుకుంటోన్న త‌రుణంలో పీకే మీద అటు బీజేపీ ఇటు జేడీయూ రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌కు దిగాయి. ఆయ‌న్ను బీజేపీ ఏజెంటుగా జేడీయూ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కు గూఢాచ‌ర్యం చేసే వ్య‌క్తిగా పీకేను బీజేపీ నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు.

`జ‌న్ సురాజ్` పాద‌యాత్ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ భారీగా ప్ర‌చారం చేశారు. వివిధ ప‌త్రిక‌ల్లో, టీవీల్లో యాడ్స్ పెద్ద ఎత్తున ఇచ్చారు. హోర్డింగ్ లు, పోస్ట‌ర్ల‌తో హోరెత్తించారు. వీట‌న్నింటికీ ఆర్థిక స‌హాయం ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని జేడీయూ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. `స్థిరపడిన రాజకీయ పార్టీలు కూడా పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడం చూడ‌లేదు. పాద యాత్ర కోసం వంద‌ల కోట్లు ప్ర‌చారానికి ఖ‌ర్చు పెడుతున్న‌ప్ప‌టికీ పీకే మీద I-T (ఆదాయపు పన్ను) శాఖ, CBI లేదా ED ఎందుకు గమనించడం లేదని JD(U) ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ ప్ర‌శ్నిస్తున్నారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ప్ర‌శాంత్ కిషోర్ త‌న పాద‌యాత్ర‌లో విమ‌ర్శించారు. ప‌దేళ్ల నుంచి వ‌రుస‌గా నితీష్ సీఎంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ బీహార్ కు ఆయ‌న ఏమీ చేయ‌లేక‌పోయార‌ని పీకే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆయ‌న వాల‌కాన్ని గ‌మ‌నించిన జేడీయూ నేత‌లు పాద‌యాత్ర‌ను ఖండిస్తూ నితీష్ పాల‌న‌కు పీకే స‌ర్టిఫికేట్ అవ‌స‌రంలేద‌ని చెబుతున్నారు. ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు ప‌నిచేసిన అత్యంత స‌మ‌స్యాత్మ‌క వ్య‌క్తిగా పీకేను పోల్చుతున్నారు. బీజేపీ పార్టీ ఏజెంట్ గా ప‌నిచేస్తున్నార‌ని దుయ్య‌బడుత‌న్నారు.

బీహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీని కొన్నేళ్లుగా న‌డిపారు. ఇప్పుడు దాన్ని వ‌దిలేసి సొంత రాష్ట్రాన్ని మార్చడానికి అంకితం అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ IPAC స్థాపకుడిని కిరాయి సైనికుడిగా బీహార్ చూస్తుంద‌ని జేడీయూ ఆరోపిస్తోంది.

మ‌రో వైపు నితీష్ కుమార్‌తో “నిగూఢ అవగాహన ప్ర‌శాంత్ కిషోర్ క‌లిగి ఉన్నాడ‌ని బీజేపీ అనుమానిస్తోంది. ఆ మేర‌కు బీహార్ బిజెపి అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఒక ప్రకటన విడుద‌ల చేశారు. ఆయ‌న్నో రాజ‌కీయ ద‌ళారిగా పోల్చారు. ఆయ‌న జ‌న్ సురాజ్ ను ప్రారంభించిన త‌రువాత జేడీయూ, బీజేపీ చేస్తోన్న ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించ‌డం ద్వారా కిషోర్ కీర్తిని పొందారు. ఆనాడు మొదటి సారిగా బిజెపికి మెజారిటీ సాధించింది. ఆ తరువాత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో JD(U), RJD మరియు కాంగ్రెస్‌ల మహా కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించాడు. సొంత రాష్ట్రంలోని జ‌నం మ‌ధ్య తిరుగుతోన్న పీకే
ను ఒక కిరాయి మ‌నిషిగా చూపే ప్ర‌య‌త్నం అటు బీజేపీ ఇటు జేడీయూ చేయ‌డం గ‌మ‌నార్హం.