ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల టాక్.
పార్టీ యువ నేత రాహుల్ గాంధీ రెండురోజుల క్రితం గుజరాత్‌కు చెందిన నేతలతో మాట్లాడుతూ ఈ విష యం వెల్లడించినట్లు తెలిసింది. అంతేకాక 2023లో జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్, కర్ణాటకలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ కిశోర్‌ను ప్రశ్నించినప్పుడు.. తాను ఇంకా కాం ట్రాక్టు కుదుర్చుకోలేదని, వాతావరణాన్ని పరిశీలించేందుకు మాత్రమే వెళ్లానని సమాధానమిచ్చినట్టు తెలిసింది.
దీనితో తెలంగాణలో కేసీఆర్‌కు సహాయం చేసే విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డ ట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషించేందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలు ఉండగా తెలంగాణలో ఆ పార్టీకి నష్టం చేకూర్చే పనిని ఆయన చేయకపోవచ్చునని ఈ వర్గాలు అంటున్నాయి. నిజానికి ప్రశాంత్ కిషోర్‌కు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను పునరుద్ధరించి పూర్వవైభవం కల్పించే పాత్రను కల్పి స్తే ఆయన పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదన్న చర్చ గతంలో జరిగింది.
ఆయనను పార్టీలో చేర్చుకుని ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించాలన్నదానిపైనా సమాలోచనలు జరిగాయి.
సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరణించిన తర్వాత పార్టీలో అన్ని వ్యవహారాలను చక్కదిద్ది సమన్వయ కర్తగా వ్యవహరించే నేత లేకుండా పోయారు. ఆ బాధ్యతను ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించడం మంచిదని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది.అయితే దీనిపై రాహుల్ గాంధీ, ఆయన టీమ్ ఒక నిర్ణయానికి రా లేకపోయింది. ఇప్పుడు యూపీతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ నేతల దృష్టి పీకేపై పడిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
సాధారణంగా ఆయన ఒక పార్టీ తరఫున వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించే ముందు క్షేత్ర స్థాయిలో పర్యటించి అన్ని విషయాలు కూలంకషంగా అధ్యయనం చేస్తారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు ఆయన ఎంతమేరకు సహాయపడతారో చెప్పడం కష్టమన్నారు. కేసీఆర్ వ్యవహార శైలికి, పీకే శైలికి పొంతన కుదరదని చెప్పారు.ఆయన కాంగ్రెస్ తరఫున పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధపడి ఆ పార్టీతో చేతులు కలిపిన పక్షంలో దాని పర్యవసానాలు తెలంగాణ రాజకీయాలపై కూడా పడతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రె్‌సతో చేతులు కలిపే విషయం గురించి ప్రశాంత్ కిషోర్‌ను అడిగినప్పుడు ఆయన వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు..