Prashant Kishor: బీహార్ పై పీకే గురి.. అసలు రీజన్ ఇదే!

తెలంగాణ చాణ‌క్యుడిన‌ని ఫీల‌య్యే కేసీఆర్ సైతం.. ప్ర‌శాంత్ కిశోర్ శ‌ర‌ణు జొచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన ఐడియాలు ఎలా ఉంటాయో.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 02:13 PM IST

తెలంగాణ చాణ‌క్యుడిన‌ని ఫీల‌య్యే కేసీఆర్ సైతం.. ప్ర‌శాంత్ కిశోర్ శ‌ర‌ణు జొచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన ఐడియాలు ఎలా ఉంటాయో. స్ట్రాటజీలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో. ప్రాంతీయ పార్టీలకు పెద్ద వరంగా మారిన ఆయన.. మొదలు పెట్టింది జాతీయ పార్టీ నీడలోనే. 2012లో గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో త‌న గెలుపు కోసం స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు అప్పటి సీఎం, ఇప్పటి ప్రధాని మోడీ. పీకే వ్యూహాల‌తోనే మోడీ మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. సోషల్ మీడియా భారత్ లో బాగా పాపులర్ అవుతున్న ఆ రోజుల్లో గుజరాత్ బ్రాండ్ ను దేశమంతా వినిపించేలా చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చాయ్ పే చర్చా, త్రీడీ ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ ఐడియాలన్నీ పీకేవేనని చెబుతుంటారు. అలా మోడీ ప్రధాని అవ్వడంలో కీలక భూమిక పోషించారు.

జాతీయ పార్టీతోనే ప్రయాణం మొదలుపెట్టినా.. ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా పని చేశారు పీకే. 2015లో బిహార్‌ లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ కోసం పని చేసి గెలిపించారు. ఆ తర్వాత పీకే పనితనం నచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా సంప్రదింపులు జరిపింది. 2017లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్, యూపీకి కాంగ్రెస్ కోసం వ్యూహాలు రచించారు. పంజాబ్ లో వర్కవుట్ అయినా.. యూపీలో మాత్రం కాంగ్రెస్ ని గెలిపించలేకపోయారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ కోసం డీల్ కుదిరింది. 2019 ఎన్నికల్లో విజయం కోసం రెండేళ్లు ముందుగా పీకేని లైన్ లో పెట్టుకున్నారు జగన్. ఎలాగోలా ఆయన్ను సీఎం చేయడంలో కీలకపాత్ర పోషించారు ప్రశాంత్ కిశోర్. 2020లో కేజ్రీవాల్ ని, 2021లో స్టాలిన్, మమతా బెనర్జీని మళ్లీ ముఖ్యమంత్రులని చేశారు.

పీకే ట్రాక్ రికార్డ్ సీఎం కేసీఆర్ కు నచ్చింది. రెండు పర్యాయాలు ఎలాగోలా నెట్టుకొచ్చిన కేసీఆర్.. మూడోసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. జాతీయ రాజకీయాల ఆశతో పీకేని సంప్రదించారు. డీల్ కూడా కుదిరింది. టీఆర్ఎస్ తరఫున పీకే అనేక సర్వేలు చేయించారు. కానీ, అదే టైమ్ లో కాంగ్రెస్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. కొన్ని మీటింగ్ లు నడిచాయి. చివరకు కలిసి పని చేయలేనని చెప్పేశారు పీకే. అయితే.. కేసీఆర్ తో ఉన్న డీల్ కారణంగానే పీకే కాంగ్రెస్ ఆఫర్ ను కాదనుకున్నారనే ప్రచారం సాగింది. కానీ, టీఆర్ఎస్ కు కూడా పీకే హ్యాండిచ్చారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉంది. దానికి కారణం.. ఆయన బిహార్ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. జేడీయూ నితీశ్ అనూహ్యంగా ఎన్డీఏ నుంచి బయటకొచ్చి.. పాత మిత్రుడు లాలూ పార్టీ ఆర్జేడీతో జట్టు కట్టారు. రాజకీయంగా ఎదుగుదలకు ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన పీకే తెలుగు రాష్ట్రాలను వదిలేసి.. బిహార్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని అంటున్నారు.

బిహార్ లో చక్రం తిప్పాలంటే.. పీకే ఒక్కరి వల్ల సాధ్యం అయ్యే పని కాదు. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీకి దగ్గరవుతున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. నిజానికి పీకే మొదట్నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నడుచుకోలేదు.. దగ్గరగానే ఉంటూ వచ్చారని గుర్తు చేస్తున్నారు. జేడీయూ, ఆర్జేడీ కూటమిని కూలదోయాలంటే రాష్ట్రంలో బలమైన బీజేపీతోనే ముందుకు వెళ్లాలని ప్రశాంత్ కిశోర్ ఫిక్స్ అయి.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అందుకే.. వైసీపీ, టీఆర్ఎస్ లను వదిలేశారని అనుమానిస్తున్నారు. వైసీపీకి రిషి రాజ్ ఆధ్వర్యంలో ఐప్యాక్ పని చేస్తోంది. అయితే.. ఐప్యాక్ తో తనకెలాంటి సంబంధం లేదని పీకే ఇప్పటికే ప్రకటించారు. ఇకపై వ్యూహకర్తగా పని చేయనని అన్నారు. అన్నట్టుగానే పార్టీలను తన అనుచరులకు వదిలేసి బిహార్ పైనే ఎక్కవ దృష్టి సారించారు. ఆ అనుచరులు టీములుగా విడిపోయి పలు పార్టీలకు పని చేస్తున్నారు.