Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే.. ’టార్గెట్ 370‘

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారం, పదిరోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Pk

Pk

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారం, పదిరోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన ఆయనకు పార్టీలో చేరాలనే ఆహ్వానం అందినట్టు తెలిసింది. దీనికి ఆయన సానుకూలంగానే స్పందించారని సమాచారం. అయితే కాంగ్రెస్ లో ఆయనకు ఏ బాధ్యతలు కేటాయిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈవివరాలను కాంగ్రెసు లోని ప్రముఖ నాయకులు తెలిపారంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ” పీకే కు కాంగ్రెస్ లో ఏ పదవి ఇవ్వబోతున్నారు ?” అని పలువురు మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ను ప్రశ్నించగా .. ” దానిపై ఒక వారంలోగా పూర్తి వివరాలను వెల్లడిస్తాం” అని ఆయన బదులిచ్చారు. దీన్ని బట్టి పీకే కాంగ్రెస్ లోకి రావడం ఖాయమనే అంచనాలకు మరింత బలం చేకూరుతోంది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం పై..

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రశాంత్ కిశోర్ శనివారం సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పీకే ప్రతిపాదించిన పలు వివరాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 370 స్థానాల్లోనే పోటీ చేయాలని పీకే సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా లలో ఒంటరిగా పోటీచేసి పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లలో ఇతర పార్టీల పొత్తు తో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పారు. పీకే చేసిన ఈ ప్రతిపాదనలతో రాహుల్ గాంధీ కూడా ఏకీభవించారని సమాచారం.

  Last Updated: 17 Apr 2022, 04:55 PM IST