Kashmir Files: మోనార్క్ జ‌స్ట్ ఆస్కింగ్..?

  • Written By:
  • Updated On - March 18, 2022 / 08:07 PM IST

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌‌ను షేక్ చేస్తూ 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఈ సినిమా పై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రం చూసి ఫిదా అయ్యారు. కొన్ని రాష్ట్రాలైతే ఈ చిత్రానికి ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇచ్చారు.

ఇక‌ 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొందరతే కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

అయితే తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంపై స్పందిస్తూ తన ట్విట్ ఖాతాలో ఓ వీడియో వదిలారు. అందులో ఓ థియేటర్‌లో వ్యక్తి ఓ వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ది కశ్మీర్ ఫైల్స్.. ఈ ప్రచార చిత్రం గాయాలను నయం చేస్తుందా.. లేక విద్వేష బీజాలను విత్తి గాయాలను మాన్పుతుందా.. జస్ట్ అడుగుతున్నా అంతే అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ప్ర‌కాష్ రాజ్‌కు కొంద‌రు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా, మ‌రికొంద‌రు నెటిజనులు ప్రకాష్ రాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంద‌రు మాత్రం ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

ఇక‌పోతే అప్ప‌ట్లో కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముస్లిం ఉగ్ర‌వాదులు కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి, సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని లేదంటే చంపేస్తామని ఉగ్ర‌మూక‌ బెదిరించారు. ఈ క్ర‌మంలో వారికి ఎదురు తిరిగినవారిని చంపేసి, వారి ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేస్తూ, అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దీంతో అప్ప‌ట్లో దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ క్ర‌మంలో నాటి పరిస్థితులను దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. అయితే ఈసినిమాను కొంద‌రు ప్ర‌శంసిస్తుండ‌గా, చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.