Prajwal Revanna : ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్‌కు తాజాగా జైలు అధికారులు కీలక బాధ్యతలు అప్పగించారు. జైలులో లైబ్రరీ క్లర్క్‌గా ఆయనకు పని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
లైబ్రరీ క్లర్క్‌గా కొత్త బాధ్యతలు
జైలు వర్గాల ప్రకారం, ప్రజ్వల్ రేవణ్ణ జైలు లైబ్రరీలో క్లర్క్‌గా పని చేస్తూ, ఇతర ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటి రికార్డులు నిర్వహించడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. ఆఫీస్ వర్క్‌తే ఇష్టపడిన ప్రజ్వల్‌కు, తగినదిగా లైబ్రరీ క్లర్క్ ఉద్యోగం కేటాయించామని చెప్పారు.
జీతం మరియు పని విధానం
జైలు వేతన నిబంధనల ప్రకారం ప్రజ్వల్‌కు రోజుకు రూ.522 జీతంగా చెల్లించనున్నారు. ప్రతి ఖైదీ సాధారణంగా వారంలో కనీసం మూడు రోజులు, నెలలో 12 రోజులు పని చేయడం తప్పనిసరిగా ఉండే నిబంధనలను ఆయనపై కూడా వర్తింపజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
కేసు నేపథ్యం
గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన సెక్స్ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ మహిళ తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం ఈ వివాదానికి కారణమైంది. బెంగళూరులోని తన నివాసంలో కొన్నేళ్ల క్రితం ఈ దుర్మార్గం జరిగిందని చెప్పిన ఆ మహిళ, ఈ కేసులో సిట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఆ తర్వాత మరిన్ని మహిళలు ముందుకు వచ్చి ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సిట్ చేపట్టిన దర్యాప్తులో ప్రజ్వల్ ఆరోపణల్లో నిజం ఉందని నిర్ధారణకు వచ్చి, కోర్టు ముందు అభియోగాలను సమర్పించారు. విచారణ అనంతరం కోర్టు ఆయనను దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ప్రజ్వల్ రేవణ్ణ పరిస్థితి ఇప్పుడు
ఒకప్పుడు ఎంపీగా ప్రజాసేవలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, ఇప్పుడు జైలులో ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడమే పనిగా మారింది. రాజకీయ జీవితంలో ఉన్న వెలుగు జ్ఞాపకాలే ఇప్పుడు అతడి ఒంటరితనాన్ని అలుముకుంటున్నాయి. అతని పరిస్థితి ఇప్పుడు అనేక విమర్శలకు దారితీస్తోంది. సామాజిక, రాజకీయ రంగాల్లో అలుపెరగని చర్చకు లోనవుతోంది.
Read Also: Ganesh Visarjan 2025: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం… ఇద్దరు మహిళల మృతి