ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) లైంగిక వేధింపుల కేసు(Harassment Case)లో దోషిగా తేలుస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ‘చట్టానికి ఎవరూ చుట్టాలు కారు’ అనే నినాదాన్ని న్యాయవ్యవస్థ మరోసారి చేసింది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఈ తీర్పు హెచ్చరికగా నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన దేవెగౌడ కుటుంబానికి చెందిన యువ నేతకు అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తీర్పు చెప్పడం ఆ కుటుంబంపై ఒక మరకగా మారింది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటకలోని హసన్ పార్లమెంటరీ నియోజకవర్గం మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై 2024లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ వార్త అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 2024లో 48 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. తాను ప్రజ్వల్ రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో పనిమనిషిగా పనిచేస్తున్నానని, 2021 నుండి ఫామ్‌హౌస్‌లోనూ, బెంగళూరులోని బసవనగుడిలోని అతని ఇంట్లోనూ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.
Maruti Swift: రూ. 30,000 జీతం ఉన్న వ్యక్తి మారుతి స్విఫ్ట్ కారు కొనగలరా? ఒక్కసారి ఈ వార్త చదవండి!
తనపై జరిగిన వేధింపుల గురించి ఎవరికైనా చెబితే, వాటిని వీడియో తీసి ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తానని ప్రజ్వల్ రేవణ్ణ బెదిరించినట్లు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పనిమనిషి చేసిన ఈ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ ఫిర్యాదు వెలుగులోకి రావడం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఫిర్యాదు తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. అయితే, దేవెగౌడ ఒత్తిడితో అతను మే 31, 2024న జర్మనీ నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంచారు.
ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, బెదిరింపులు వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. బెంగళూరులోని ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో జస్టిస్ సంతోష్ కజానన్ భట్ ముందు ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 2024లో అతనిపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత అతను బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసి, జైలులోనే ఉండాలని ఆదేశించింది. ఫలితంగా, అతను ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు. ఈ తీర్పు మాజీ ప్రధాని కుటుంబానికి చెందిన వ్యక్తికి శిక్ష పడటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.