పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) జూలై 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. సెషన్‌లో సత్ఫలితాలను ఇచ్చే అంశాలపై చర్చలకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. ఆ తరువాత కొత్త భవనానికి మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వరకు కొనసాగుతాయి. అయితే, నూతన పార్లమెంట్ భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే కానున్నాయి.
Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the #MonsoonSession.
— Pralhad Joshi (@JoshiPralhad) July 1, 2023
మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు ఏకమవుతున్నాయి. ప్రతిపక్షాలు అధికార బీజేపీని ఇరుకున పెట్టేలా ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకొనే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫాం సివిల్ కోడ్ పై మాట్లాడటం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్‌ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యూనిఫాం సివిల్ కోడ్‌ను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఆ అంశంపై త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
పార్లమెంట్ సెషన్‌లో ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. సేవల విషయంపై నగర ప్రభుత్వానికి ఎక్కువ శాసన, పరిపాలనా నియంత్రణను అందించిన సుప్రీం కోర్టు తీర్పును సమర్థవంతంగా రద్దు చేసిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్ ను ప్రభుత్వం భర్తీ చేయడానికి ప్రభుత్వ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును త్వరగా ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదేవిధంగా బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.