Site icon HashtagU Telugu

Praggnanandhaa : కార్ల్‌సన్‌కి షాకిచ్చిన ప్రగ్యానంద.. లాస్‌వేగాస్‌లో సంచలన విజయం

Praggnanandhaa

Praggnanandhaa

Praggnanandhaa : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. లాస్ వెగాస్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను 39 మెళకువలలోనే ఓడించి సంచలనం సృష్టించాడు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ప్రగ్యానంద చెస్ లోకానికి మరోసారి తన శక్తిని చాటాడు.

ఇటీవలి కాలంలో భారత స్టార్ ప్లేయర్ డి. గుకేష్ చేతిలోనూ మాగ్నస్ కార్ల్‌సన్ ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ధోరణిలో ప్రగ్యానంద చేతిలోనూ పరాజయం చెందడం అతడి ఫార్మ్‌పై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఇది కార్ల్‌సన్‌కు వరుసగా మూడో దెబ్బగానే చెప్పాలి.

ఫ్రీస్టైల్ చెస్ టూర్‌లో 10 నిమిషాలు ప్లస్ 10 సెకన్ల ఇన్‌క్రిమెంట్ టైమ్ కంట్రోల్‌తో ఆట జరుగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో నాల్గో రౌండ్‌లో ప్రగ్యానంద కార్ల్‌సన్‌ను నిఖార్సైన వ్యూహంతో మట్టికరిపించాడు. ఇది అతడి చెస్ కెరీర్‌లో ఒక మైలురాయి విజయం.

ప్రగ్యానంద ఇప్పటికే ఈ ఏడాది మూడు అంతర్జాతీయ టోర్నీలను గెలిచి తన సత్తా చాటాడు. Classical, Rapid, Blitz — మూడు ఫార్మాట్‌ల్లోనూ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన అరుదైన క్రీడాకారుడిగా నిలిచాడు. ఇది భారత చెస్ చరిత్రలో అరుదైన ఘనత.

అతడు మొదటి రౌండ్‌లో నోదిర్‌బెక్ అబ్దుసత్తారోవ్‌తో డ్రా చేసాడు, తర్వాత అస్సౌబాయేవాపై విజయం సాధించాడు. తర్వాతి రౌండ్‌లో కీమర్‌ను బ్లాక్‌తో గెలిచిన తర్వాతే కార్ల్‌సన్‌ను ఎదుర్కొన్నాడు. అలా వరుస విజయాలతో గ్రూప్ వైట్‌లో 4.5 పాయింట్లతో టాప్ స్థానం దక్కించుకున్నాడు.

కార్ల్‌సన్ ఈ టోర్నీకి ఫేవరెట్‌గా బరిలో దిగాడు. పారిస్, కారల్స్‌రూహే టూర్‌లను ఇప్పటికే గెలిచిన అతడు, ఈసారి మాత్రం నాకౌట్ దశకు కూడా వెళ్ళలేకపోయాడు. మొదట రెండు విజయాలతో బాగానే ప్రారంభించినా, తర్వాతి మ్యాచ్‌ల్లో ప్రగ్యానంద, వెస్లీ సో చేతిలో పరాజయం పాలై, చివరి మ్యాచ్ గెలిచి కూడా ప్లేఆఫ్‌లో లెవాన్ ఆరోనియన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో అతడు టైటిల్ పోరాటం నుంచి పూర్తిగా ఔట్ అయ్యాడు.

గ్రూప్ వైట్‌లో ప్రగ్యానంద, అబ్దుసత్తారోవ్, సిందారోవ్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాల్లో నిలిచారు. లెవాన్ ఆరోనియన్ 4 పాయింట్లతో చివరి అర్హత స్థానం పొందాడు. కార్ల్‌సన్ 3.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

గ్రూప్ బ్లాక్‌లో హికారు నాకమురా అద్భుత ప్రదర్శనతో 6/7 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. హాన్స్ నీమన్ 4.5 పాయింట్లతో మెరుగైన స్థితిని కనబరిచాడు. ఫాబియానో కారువానా, అర్జున్ ఎరిగైసి కూడా నాకౌట్ దశకు వెళ్లిన ఆటగాళ్లలో ఉన్నారు.

ఈ టోర్నీకి ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఫ్రీస్టైల్ చెస్ పేరుతో యూఎస్‌లో తొలిసారి Wynn Las Vegas హోటల్ బాల్‌రూంలో నిర్వహిస్తోంది. 16 మంది ఆటగాళ్లతో రెండు గ్రూపుల్లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు జరిగాయి. టాప్ నాలుగు ఆటగాళ్లు టాప్ బ్రాకెట్‌కి, మిగతా నలుగురు లోయర్ బ్రాకెట్‌కి వెళ్లారు. లోయర్ బ్రాకెట్‌లో గెలిచిన వారు మూడో స్థానానికి పోటీ పడతారు కానీ టైటిల్ అవకాశాలు ఉండవు.

ఈ భారీ టోర్నీ విజేతకు USD 2 లక్షల నగదు బహుమతి ఉంది. గురువారం నుంచి క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. టాప్ బ్రాకెట్‌లో ఓడిపోయిన ఆటగాళ్లు లోయర్ బ్రాకెట్‌లోకి వెళ్లి తదుపరి మ్యాచ్‌లు ఆడతారు. జయించిన ఆటగాళ్లు టైటిల్‌ కోసం పోరాడతారు.

Trump : మారని ట్రంప్.. 150కు పైగా దేశాలకు ఉమ్మడి కస్టమ్ డ్యూటీ..?