Site icon HashtagU Telugu

Midnight Runner Pradeep Mehra: నా సక్సెస్.. నేనేంటో చెప్పాలి..!

Pradeep Mehra Viral Video

Pradeep Mehra Viral Video

ప్రదీప్ మెహ్రా గుర్తున్నాడుగా.. బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి వీడియోతో ఓవర్‌ నైట్ సెల‌బ్రిటీ అయిపోయాడు ప్ర‌దీప్. ఈ క్ర‌మంలో ఇప్పుడు ప్రదీప్ మెహ్రా ఇట‌ర్వ్యూ కోసం అన్ని చాన‌ళ్ళు అత‌ని వెంట‌ప‌డుతున్నాయి. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే, ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ప్ర‌దీప్ మెహ్రా, త‌న‌కు వ‌చ్చిన పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడా లేక త‌న‌ను అన‌వ‌స‌రంగా పాపుల‌ర్ చేశార‌ని ప్ర‌దీప్ ఫీల్ అవుతున్నాడా అనే ప్ర‌య‌త్నం చేశారు వినోద్ కాప్రి.

ఈ నేప‌ధ్యంలో తాజాగా ప్రదీప్ మెహ్రాను కలిసిన వినోద్ కాప్రి అతని ఫీలింగ్స్‌ను తెలుసుకుని, దానికి సంబంధించిన వీడియోను తాజాగా త‌న ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇటీవ‌ల జనాలు త‌న‌ని ఎక్కువ‌గా పాపులర్ చేస్తున్నారని ప్ర‌దీప్ మెహ్రా అన్నారు. అయితే ఈ పాపులారిటీ కార‌ణంగా తాను గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించడం లేద‌ని ప్ర‌దీప్ అన్నాడు. పాపులారిటీ అనేది త‌న లక్ష్య సాధనకు ఆటంకంగా మారుతుంద‌ని, దీంతో త‌న లక్ష్యంపై ఫోకస్ పెట్టలేనని ప్ర‌దీప్ మెహ్రా తెలిపాడు.

ఇక మీడియా చాన‌ళ్ళ‌లో ఇంటర్వ్యూలు ఇవ్వడం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పిన ప్ర‌దీప్, నా సక్సెస్ నేనేంటో చెప్పాలని అంటున్నాడు. అందుకు తాను మౌనంగానే కష్టపడాలని అనుకుంటున్నాన‌ని, ఈ క్రమంలో ఇటీవ‌ల త‌న‌కు వ‌చ్చిన పాపులారిటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాన‌ని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రదీప్ మెహ్రా త‌న‌కు వ‌చ్చిన పాపులారిటీ పై చెప్పిన విశేషాలకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక‌పోతే నోయిడాలోని సెక్టార్ 16లో ఉన్న మెక్ డొనాల్డ్‌లో పనిచేస్తున్న ప్ర‌దీప్ మెహ్రా, ఇటీవల ఓరోజు రాత్రి 12 గంటలకు తన విధులు ముగించుకుని ఎప్ప‌టిలాగే ప‌రిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డుపై అటుగా వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ వినోద్ కాప్రి ప్రదీప్ మెహ్రాను చూసి, ఇంటి వ‌ద్ద డ్రాప్ చేస్తాన‌ని లిఫ్ట్ ఆఫ‌ర్ ఇచ్చాడు. అయితే వినోద్ కాప్రి ఆఫర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు ప్ర‌దీప్ మెహ్రా. ఆర్మీలో చేరాల‌నేది త‌న క‌ల అని, దీంతో తాను రోజు ఇలాగే ప‌రిగెత్తుకుంటూ ఇంటికి వెళ‌తాన‌ని ప్ర‌దీప్ చెప్పాడు.

ప్ర‌దీప్ ఆన్స‌ర్‌తో ఆశ్చ‌ర్య‌పోయిన డైరెక్ట‌ర్ వినోద్.. క‌నీసం డిన్న‌ర్ అయినా చేద్దాం రా అంటూ పిల‌వ‌గా, అందుకు కూడా ప్ర‌దీప్ సున్నితంగా తిరస్క‌రించారు. ఇంటి ద‌గ్గ‌ర త‌న అన్న ఎదురు చూస్తూ ఉంటాడ‌ని, త్వ‌ర‌గా ఇంటికి వెళ్ళి తాను వంట చేయాల‌ని, త‌న అన్న నైట్ షిప్ట్ వెళ‌తాడ‌ని, దీంతో తానే వంట చేస్తాన‌ని ప్ర‌దీప్ తెలిపాడు. మ‌రి త‌ల్లిదంద్రులు ఏం చేస్తార‌ని డైరెక్ట‌ర్ అడ‌గ్గా, త‌ల్లి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్న‌ట్లు తెలిపాడు. దీంతో మరోసారి తాను డ్రాప్ చేస్తాన‌ని వినోద్ అడగ్గా, వద్దు స‌ర్.. ఒక్క‌రోజే క‌దా అని కారెక్కితే త‌న ప్రాక్టీస్‌కి ఆటంకం క‌లుగుతుంద‌ని ప్ర‌దీప్ మెహ్రా బ‌దులిచ్చారు.

ఈ నేప‌ధ్యంలో ప్రదీప్ మెహ్రా పట్టుదలకు, త‌ను ఎంచుకున్న ల‌క్ష్యం కోసం అతను కష్టపడుతున్న తీరు చూసి వినోద్ కాప్రి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ క్ర‌మంలో ప్రదీప్ మెహ్రా రన్నింగ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని డైరెక్ట‌ర్ వినోద్ కాప్రి అతనితో చెప్పాడు. దానికి నన్నెవరు గుర్తిస్తారని ప్ర‌దీప్ అడగ్గా, ఒకవేళ వైరల్ అయితే అని వినోద్ పాజ్ ఇవ్వ‌గా, వైరల్ అయితే కానివ్వండి, తానేమి తప్పుడు పని చేయడంలేదు క‌దా అని ప్రదీప్ బదులిచ్చాడు. దీంతో ఆ వీడియోను వినోద్ కాప్రి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ క్ర‌మంలో లక్ష్య సాధన కోసం ప్రదీప్ మెహ్రా కష్టపడుతున్న తీరుకు, నెటిజన్లు ఫిదా అవుతూ, ప్రదీప్‌కు కాంగ్రాట్స్ చెబుతున్నారు.