Power Crisis : దేశంలో విద్యుత్ సంక్షోభం రాబోతోందా? ఢిల్లీ వార్నింగ్ బెల్ మోగించిందా?

కొన్నాళ్ల కిందట దేశాన్ని బొగ్గు కష్టాలు కుదిపేశాయి. ఎందుకంటే ఆ బొగ్గు ఉంటేనే విద్యుత్ తయారయ్యేది.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 11:04 AM IST

కొన్నాళ్ల కిందట దేశాన్ని బొగ్గు కష్టాలు కుదిపేశాయి. ఎందుకంటే ఆ బొగ్గు ఉంటేనే విద్యుత్ తయారయ్యేది. ఇప్పటికి మన దేశం ఆ రకం విద్యుత్ పై ఎక్కువగానే ఆధారపడుతోంది. ఢిల్లీలో కేవలం ఒక్కరోజుకు సరిపడా నిల్వలున్నాయన్న కారణంతో ఆసుపత్రులకు, మెట్రోకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. అసలెందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది? గత అనుభవం నుంచి కేంద్రం కాని, రాష్ట్రాలు కాని పాఠాలు నేర్చుకోలేకపోయాయా?

ఈసారి దేశంలో వివిధ చోట్ల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కరెంటు కోతలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయానికి విద్యుత్ ను ఎక్కువగా ఉత్పత్తి చేద్దామన్నా సరే.. బొగ్గు నిల్వలు లేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అయినా రాష్ట్రాలు ఇంతగా బాధపడుతుంటే.. కేంద్రం చోద్యం చూస్తోందా?

ముందుగా రాష్ట్రాలను ఎందుకు హెచ్చరించలేదు?

మామూలుగా అయితే విద్యుత్ కేంద్రాల్లో 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. కానీ దేశంలో వివిధ విద్యుత్ కేంద్రాల్లో ఒక్కరోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. కేంద్రం మాత్రం ఇది రాష్ట్రాల తప్పే అని వాటిమీదకు తోసేస్తోంది. అదేమంటే.. కోల్ ఇండియా లిమిటెడ్ కు రాష్ట్రాలు సరిగా చెల్లింపులు చేయడం లేదని అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది. అసలిది విద్యుత్ సంక్షోభమా? లేక చెల్లింపుల సంక్షోభమా? అంటే.. ఇది కేవలం చెల్లింపుల సంక్షోభమే అని కేంద్రం అంటోంది. దేశంలో విద్యుత్ సరఫరాకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని అంటోంది. కోల్ ఇండియాకు బకాయిలు చెల్లిస్తే.. అది బొగ్గును సరఫరా చేస్తుందంటోంది. కానీ ఈ చెల్లింపుల వివాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అటు కోల్ ఇండియా మాత్రం బకాయిలతో ఏమాత్రం సంబంధం లేకుండానే తాము బొగ్గును సరఫరా చేస్తున్నామంటోంది. మరిప్పుడు ఎవరి మాట నిజం? కోల్ ఇండియా దగ్గర నిజంగానే బొగ్గుంటే.. ఇంతటి సంక్షోభం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మే, జూన్ నెలల్లో ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత తీవ్రం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.