Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ

‘‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్‌’’ అని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి.

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 12:59 PM IST

Future PM : ‘‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్‌’’ అని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. జులై 1న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బర్త్ డే ఉంది. ఈసందర్బంగా ఆయన అభిమానులు సమాజ్ వాదీ పార్టీ ఆఫీసు వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.

యోగి వేవ్‌‌ను ఎదుర్కొని నెగ్గి.. 

ఉత్తరప్రదేశ్‌లో శక్తివంతమైన నేతగా ఎదిగిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఎదుర్కొని పెద్దసంఖ్యలో ఎంపీలను గెలిపించుకున్న అఖిలేష్ యాదవ్‌కు దేశ ప్రధాని అయ్యే అర్హతలు ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు వాదిస్తున్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగానూ సమాజ్‌వాదీయే ఉందని వారు గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయ సమీకరణాలు మారితే ప్రధాని అయ్యే అవకాశం అఖిలేష్‌కే  దక్కాలని సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అఖిలేష్ యాదవ్‌ దేశానికి కాబోయే ప్రధాని(Future PM) అని పేర్కొంటూ ఇలాంటి పోస్టర్లు ఏర్పాటు కావడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకు ముందు 2023 అక్టోబర్‌లో సమాజ్‌వాదీ పార్టీ లక్నో కార్యాలయం వెలుపల ఇలాంటి పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ ఫ్లెక్సీని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ ‘చాంద్’ ఏర్పాటు చేయించారు.

We’re now on WhatsApp. Click to Join

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 ఎంపీ స్థానాలకుగానూ 37 చోట్ల సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించింది. దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 33 సీట్లను గెల్చుకుంది. మరో మూడు సీట్లలో బీజేపీ భాగస్వామ్య పార్టీ ఆర్‌ఎల్‌డీకి రెండు సీట్లు, అప్నాదళ్ (ఎస్) ఒక సీటును చేజిక్కించుకున్నాయి. కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ 1,70,922 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌ను ఓడించి సమాజ్‌వాదీ నేత అవధేష్ ప్రసాద్ రాజకీయ సంచలనం సృష్టించారు.