OTT Apps : దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓటీటీ వేదికల్లో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు బహిరంగంగా అశ్లీల చిత్రాలు, వీడియోలు ప్రసారం చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, మొత్తం 25 యాప్‌లు మరియు వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేదికలు నిరంతరం భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, నియమ నిబంధనలను తృణప్రాయంగా భావిస్తూ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది. ముఖ్యంగా ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్ వంటి యాప్‌లు పునరావృతంగా వయోజన కంటెంట్‌ను వివాదాస్పదంగా ప్రసారం చేస్తున్నట్లు గుర్తించి వాటిపై కొరడా ఝుళిపించింది.
నిషేధిత యాప్‌లు, వెబ్‌సైట్లు ఇవే:
ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫినియో, షోఎక్స్, సోల్ టాక్స్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్‌ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్.
ఈ యాప్‌లు, వెబ్‌సైట్లను భారతదేశంలోని ఇంటర్నెట్ సేవలందించే సంస్థలు బ్లాక్ చేయాలని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించకుండా ఉల్లంఘిస్తే, వారు చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
డబ్బుల ఎర.. అసభ్యతా వ్యాపారం
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్లు వీడియోలు చూస్తే డబ్బులే డబ్బులు అనే ఆశ చూపుతూ, వినియోగదారులను ఆకర్షించి వారి డేటా దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌లను ఉపయోగిస్తున్న పెద్ద సంఖ్యలో యువత అసమర్థవైన, అసభ్యకర కంటెంట్‌కు బానిసలవుతుండటం భద్రతపరంగా, మానసిక ఆరోగ్యపరంగా ప్రమాదకరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
కంటెంట్‌పై బాధ్యత తీసుకోవాలని సూచన
ఓటీటీ సేవలందించే సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భారతీయ చట్టాలను ఉల్లంఘించే విధంగా కంటెంట్‌ను ప్రసారం చేస్తే, తగిన చర్యలు తప్పవు అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ చర్యలతో ఓటీటీ రంగంలో బాధ్యతాయుత ప్రసారానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇలాంటి నిషేధాలు వినియోగదారులను కూడా కంటెంట్ ఎంపికలో చురుకుగా మారేలా చేస్తాయని భావిస్తున్నారు.
Read Also: Thailand Cambodia Conflict : కంబోడియా-థాయిలాండ్ మధ్య ఘర్షణలు.. 900 ఏళ్ల పురాతన ఆలయం చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు?