Voting Updates : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఓటర్లు తమ వజ్రాయుధంతో ఎన్నికల తీర్పును ఇచ్చేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు ఇవాళ రెండో విడతపోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాలలో ఈరోజు ఒకేవిడతలో ఓటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29, ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలను సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
మధ్యప్రదేశ్ ముఖచిత్రం..
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు 64,626 ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 5.6 కోట్ల మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది. మహిళా ఓటర్లు 2.72 కోట్ల మంది. మొత్తం అభ్యర్థులు 2,533 మంది ఉన్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 252 మంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉంది. 2018లో కాంగ్రెస్ గెలిచి సర్కారు ఏర్పాటు చేసినా.. 2020లో 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మళ్లీ బీజేపీకి చేతికే అధికారం చిక్కింది. 22.36 లక్షల మంది యువత ఈదఫా తొలిసారి ఓటు వేయబోతున్నారు. ఛతర్‌పూర్ జిల్లాలోని మల్హారా నుంచి ఒక్క థర్డ్ జెండర్ అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక అభ్యర్థుల్లో కమల్ నాథ్, గోవింద్ సింగ్, విక్రమ్ మస్టల్.. బీజేపీ కీలక అభ్యర్థుల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్ విజయవర్గీయ, నరోత్తమ్ మిశ్రా ఉన్నారు.
Also Read: ICC World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!
ఛత్తీస్‌గఢ్ ముఖచిత్రం..
ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు నవంబరు 7నే పోలింగ్ జరిగింది. మిగతా 70 స్థానాలకు ఇవాళ రెండో విడతగా పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలు 18,833 ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1,63,14,479 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 81,41,624 మంది, మహిళా ఓటర్లు 81,72,171 మంది ఉన్నారు. మొత్తం అభ్యర్థులు 958 ఉండగా, వారిలో మహిళా అభ్యర్థులు 130 మంది ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2018 ఎన్నికలలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు 68 సీట్లు రాగా, బీజేపీ 15 సీట్లకే(Voting Updates) పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, అసెంబ్లీ స్పీకర్ చరణ్‌దాస్ మహంత్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్, ఉన్నారు. బీజేపీ కీలక అభ్యర్థుల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నారాయణ్ చందేల్, కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో ఉన్నారు.