Electoral Rolls : జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా అత్యంత కచ్చితత్వంతో ఓటరు జాబితాను అప్‌డేట్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఓటర్ల మరణాలకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు (BLOs) క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారని ఈసీ చెప్పింది.
ఈఆర్‌ఓలు ఇక సకాలంలో..
ఎన్నికల నిబంధనలు-1960, జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొంది. ప్రభుత్వం వద్ద నమోదైన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) సకాలంలో తీసుకోవచ్చని ఈసీ చెప్పింది. ఇక నుంచి ఓటర్ల మరణాలపై వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు అధికారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
Also Read :CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్‌లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు
ఓటరు సమాచార చీటీ డిజైన్‌లో మార్పు
ఓటరు సమాచార చీటీ (VIS) మరింత స్పష్టంగా కనిపించేందుకు, దాని డిజైన్‌ను మారుస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచుతామని వెల్లడించింది. తద్వారా ఓటర్లు పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించవచ్చని చెప్పింది. దీంతోపాటు ఓటర్ల జాబితాలోని పేర్లను సులభంగా చెక్ చేసుకునే వీలు పోలింగ్ అధికారులకు ఉండేది. బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేస్తామని ఈసీ(Electoral Rolls) చెప్పింది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయడాన్ని కీలక పరిణామంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. తద్వారా ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేసేందుకు అవకాశం కలుగుతుందని అంటున్నారు. చనిపోయిన వారి పేర్లతో ఇతరులు ఓట్లు వేసే తప్పుడు ట్రెండును కూడా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.