Site icon HashtagU Telugu

మోడీ సరికొత్త స్లోగ‌న్ జై అనుసంధాన్ .. క‌రోనా నియంత్ర‌ణ వైఫ‌ల్యంపై అధ్య‌య‌నాస్త్రం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌రికొత్త స్లోగ‌న్‌కు తెర‌పేపాడు. జై జ‌వాన్..జై కిసాన్..జై విజ్ఞాన్..జై అనుసంధాన్ అంటూ నిన‌దిస్తున్నారు. ఆమెరికా ప‌ర్య‌ట‌న వెళ్లొచ్చిన త‌రువాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌రోనా 2019 ను విజ‌య‌వంతంగా ఎదుర్కొవ‌డానికి అనుసంధానం బాగా ప‌నిచేసింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అధ్య‌య‌నం ద్వారా అనుసంధానం సాధ్య‌మ‌యింద‌ని చెప్పారు. అందుకే ఇక నుంచి జై అనుసంధాన్ స్లోగ‌న్ ప్ర‌తి వేదిక మీద వినిపించాల‌ని పిలుపు నిచ్చారు మోడీ.
అధ్య‌య‌నంతో కూడిన విమ‌ర్శ‌ల‌కు విలువ ఇవ్వ‌డానికి మోడీ సిద్ధం అయ్యాడు. ఇటీవ‌ల క‌రోనా వైఫ‌ల్యంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న లైట్ గా తీసుకున్నారు. అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రించారు. అధ్య‌య‌నం చేయ‌కుండా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జంగా మారింద‌ని మోడీ అభిప్రాయం. అందుకే కొన్ని మీడియా సంస్థ‌లు రీసెర్చ్ చేయ‌కుండా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కొట్టిపారేశారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా ఉన్న భార‌త్ క‌రోనా నియంత్ర‌ణను ప‌గ‌డ్భందీగా చేసింద‌ని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు.
దేశ వ్యాప్తంగా దాదాపు 69శాతం పెద్ద‌ల‌కు క‌నీసం ఒక‌సారి క‌రోనా 2019 వ్యాక్సిన్ వేయించుకున్నారు. 20 మందికి రెండుసార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ మేర‌కు మోడీ డేటాను మీడియా ముందు చెప్పారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి నాటికి అర్హులు అంద‌రికీ వ్యాక్సిన్ అందుతుంద‌ని వివ‌రించారు. గ‌త ఏడాది మేలో మొద‌లు పెట్టిన వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను టెక్నాల‌జీ మ‌ద్ధ‌తుతో చాలా వేగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పూర్తి స్థాయి అనుమ‌తులు వ్యాక్సిన్ ల‌కు రాని స‌మ‌యంలోనే భార‌త్ అప్ర‌మ‌త్తం అయింది. కోవీషీల్డ్‌, కోవాక్సిన్, ఆస్ట్రాజ‌నికా వ్యాక్సిన్ల‌కు వెంట‌నే అనుమ‌తులు ఇవ్వ‌డానికి అనువైన పద్ద‌తుల‌ను భార‌త ప్ర‌భుత్వం అనుస‌రించింది. సంచార పేద‌లు కూడా రెండో డోస్ ఎక్క‌డ నుంచైనా వేయించుకునే వెసుల‌బాటు క‌ల్పించారు. అభివృద్ధి చెందిన ప్ర‌పంచ దేశాల కంటే భార‌త్ ముందుగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేసింది. ఆయా దేశాల కంటే మెరుగైన స్థితిలో భార‌త్ ఉంది. విమ‌ర్శ‌లు చేసే ముందు అధ్య‌య‌నం చేయాల‌ని మోడీ హిత‌వు ప‌లికారు.
రాబోయే రోజుల్లో ఆరోగ్యానికి మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం అయింది. 2014 నాటికి దేశ వ్యాప్తంగా కేవ‌లం ఆరు ఎయిమ్స్ ఆస్ప‌త్రులు ఉండ‌గా, ప్ర‌స్తుతం వాటి సంఖ్య 23కు చేరింది. మెడిక‌ల్ కాలేజిలు 380 ఉండ‌గా 2014 నాటికి, అవి ప్ర‌స్తుతం 560 వ‌ర‌కు చేరాయి. భ‌విష్య‌త్ లో మెడిక‌ల్ అండ్ హెల్త్ విభాగాన్ని మ‌రింత ఆధునీక‌రించ‌డంతో పాటు పేద‌ల‌కు ఆరోగ్యాన్ని అందించేలా భార‌త్ ప్లాన్ చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లో వ్యాధి నిర్థార‌ణ కేంద్రాలు ఏర్పాటు, ఆయుర్వేద‌, హోమియోప‌తి వంటి సంప్ర‌దాయ వైద్యాన్ని అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అయింది. ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా పారిశుద్ద్యం, ప‌రిశుభ్ర‌మైన మంచినీళ్లు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త కోసం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది. ఆ మేర‌కు మోడీ త‌న మ‌దిలోని బ్లూ ప్రింట్ ను విడ‌మ‌ర‌చి చెప్పారు.
ప్ర‌జా స‌హ‌కారం హెల్త్ సిబ్బందికి పూర్తిగా ఉండాల‌ని కోరారు. చాలా ప‌రిమిత ప‌రిజ్ఞానంతోనే క‌రోనాలాంటి వైర‌స్ ను విజ‌య‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. రాబోయే రోజుల్లో ఆర్థిక ప‌రిస్థితులు కూడా మెరుగుప‌డ‌తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు మోడీ.

Exit mobile version