Constitution Day 2024 : మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి రేపటి (నవంబరు 26)తో 75 ఏళ్లు పూర్తవుతాయి. 1949 నవంబరు 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమలవుతోంది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక తొలిసారిగా 2015 నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఈ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా(Constitution Day 2024) దేశమంతటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసందర్భంగా మంగళవారం రోజు పార్లమెంటులో, సుప్రీంకోర్టులో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. సుప్రీంకోర్టులో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబల్ తదితరులు పాల్గొననున్నారు.
Also Read :Constitutions Preamble : రాజ్యాంగ ప్రవేశికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పార్లమెంటులో..
మంగళవారం రోజు ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఉన్న సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్స్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రసంగించే అవకాశాన్ని లోక్‌సభ విపక్ష నేత, రాజ్యసభ విపక్ష నేతకు కూడా కల్పించాలని కోరుతూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్‌పర్సన్‌లకు ఉమ్మడిగా లేఖలు రాశారు. ఈ లేఖలపై విపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు.
- మంగళవారం నుంచి ఏడాది పొడవునా జరగనున్న రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
- రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రజలు చదవొచ్చు.