77 th Independence Day : పంద్రాగస్టుకు ముస్తాబైన భారత్.. ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (77 th Independence Day) దృష్ట్యా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 09:01 AM IST

77 th Independence Day : 77 వ స్వాతంత్ర్య దినోత్సవాలకు యావత్ భారతావని ముస్తాబైంది. ఇవాళ ఉదయం 7.06 నిమిషాలకు దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళి అర్పించనున్నారు. అనంతరం 7.18కి ఆయన ఎర్రకోటకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరణ చేయనున్నారు. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయడం ఇది వరుసగా పదోసారి. ప్రధాని జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అనే రెండు హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి. అనంతరం 7.33 నిమిషాలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (77 th Independence Day)  దృష్ట్యా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎర్రకోట చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 10 వేల మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 1,000 సెక్యూరిటీ కెమెరాలు, 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు నుంచి నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు కూడా పాల్గొననున్నాయి.

వేడుకలకు 1800 మంది ప్రత్యేక అతిథులు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వివిధ వర్గాలకు చెందిన 1800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వీరిలో సర్పంచులు, రైతులు, పార్లమెంట్ నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, హర్ ఘర్ జల్ కార్మికులు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఉన్నారు. ఆహ్వానితుల్లో 268 మంది వీఐపీలకు హై-సెక్యూరిటీ జోన్‌లో చోటు కల్పించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30 వేల నుంచి 40 వేల వరకు మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలోని జ్ఞాన్‌పథ్‌లో 1,000 మందికి, మాధవ్‌దాస్ పార్క్‌లో 4,766 మందికి, ఆగస్ట్ 15 పార్క్‌లో 20,450 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు.

 

Also Read: Independence Day 2023 : ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎన్ని కెమెరాలతో టెలికాస్ట్ చేస్తారో తెలుసా? వామ్మో.. ఇన్ని కెమెరాలా?