PM Modi: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పోరు, దాని వివిధ కోణాలు, భారత వ్యూహం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 24) రాజ్యసభలో ప్రసంగించారు. ఈ ఉద్రిక్తతల వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులపై పడుతున్న ప్రభావం, ఈ సంక్షోభం వల్ల ఏర్పడే వాణిజ్య, ఆర్థిక పరిణామాల గురించి ఆయన వివరించారు.
‘యుద్ధం వల్ల ఇంధన సంక్షేమం పెరిగింది’
ఈ పోరు భారత్‌కు ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. యుద్ధం కారణంగా వాణిజ్య మార్గాలు దెబ్బతింటున్నాయని, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలలో ఒక కోటి మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత గురించి భారత్ ఎంతో ఆందోళన చెందుతోందని చెప్పారు.
‘హోర్ముజ్ జలసంధిలో అడ్డంకులు ఆమోదయోగ్యం కాదు’
ప్రధాని మాట్లాడుతూ.. “భారత్ ప్రస్తుతం ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంపై వారితో చర్చించాం. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం లేదా హోర్ముజ్ జలసంధిలో అడ్డంకులు సృష్టించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను భారత్ వ్యతిరేకిస్తోంది” అని స్పష్టం చేశారు. ముడి చమురు, గ్యాస్, ఎరువులు పెద్ద మొత్తంలో ఈ మార్గం గుండానే వస్తాయని, దౌత్య మార్గాల ద్వారా చమురు సరఫరా భారత్‌కు చేరేలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read: కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
‘శాంతికి చర్చలే మార్గం’
ఈ సమస్య పరిష్కారానికి చర్చల మార్గాన్నే భారత్ సూచించిందని ప్రధాని అన్నారు. యుద్ధం వల్ల ప్రాణనష్టం జరగడం మానవత్వానికి మంచిది కాదని, శాంతియుత పరిష్కారం కోసం అన్ని పక్షాలను ప్రోత్సహించడమే భారత్ లక్ష్యమని చెప్పారు. యుద్ధం మొదలైనప్పటి నుండి 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుండి 1000 మందికి పైగా భారతీయులు తిరిగి వచ్చారు. వీరిలో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.
‘భారతీయుల భద్రతే ప్రాధాన్యత’
సంక్షోభం మొదలైనప్పటి నుండి పశ్చిమ ఆసియాలోని మెజారిటీ దేశాలతో రెండు రౌండ్ల చర్చలు జరిపినట్లు ప్రధాని వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో భారతీయుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని, ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత సున్నితత్వంతో పని చేస్తోందని అన్నారు. కొన్ని దాడుల్లో కొందరు భారతీయులు మరణించడం లేదా గాయపడటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
‘ముడి చమురు తగినంత నిల్వ ఉంది’
భారత్ వద్ద ముడి చమురు తగినంత నిల్వ ఉందని, నిరంతర సరఫరా కోసం ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని భరోసా ఇచ్చారు. ఏదైనా ఒక్క ఇంధన వనరుపైనే ఎక్కువ ఆధారపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎల్‌పిజి (LPG) తో పాటు పిఎన్‌జి (PNG) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేశామని ఆయన వివరించారు. దేశీయంగా ఎల్‌పిజి ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
