PM Modi : అహ్మదాబాద్ విమానాశ్రయం దగ్గర నిన్న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 265 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించేందుకు ఇవాళ ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అయన ముందుగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కూలిన విమాన శిధిలాలను పరిశీలించి, అధికారులు అందించిన నివేదికలపై సమీక్ష చేశారు. అనంతరం సివిల్ హాస్పిటల్ వెళ్లి, ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులనుంచి పూర్తివివరాలు తెలుసుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi holds a review meeting with the officials at the airport in Ahmedabad in the wake of yesterday's #AirIndiaPlaneCrash.
(Source – DD) pic.twitter.com/V9M0B5RDsb
— ANI (@ANI) June 13, 2025
గాయపడినవారిలో ఉన్న ఓ బ్రిటిష్ నాగరికుడు విశ్వాస్ కుమార్ రమేశ్‌ను ప్రత్యేకంగా కలిసిన ప్రధాని, అతడి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 38 ఏళ్ల రమేశ్ బుచర్వాడ, బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు. ప్రమాదం నుంచి బయటపడ్డ అతడిని ‘మృత్యుంజయుడు’గా మోడీ అభివర్ణించారు. ఆసుపత్రి పర్యటన అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, విమానాశ్రయ సిబ్బంది, సహాయ చర్యల లో పాల్గొన్న అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల ప్రభావం, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోవడం ప్రధాన విషాదాంశంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలుపనున్నారు. దేశానికి అద్భుత సేవలు అందించిన నేతను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భద్రతను మరింతగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, అవసరమైన మార్పులు చేసేందుకు సూచనలు ఇచ్చారు. విమాన ప్రమాదంపై సీఐడీ, డిజీసీఏ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.